అనుమతి తప్పనిసరి..!

by Shyam |
అనుమతి తప్పనిసరి..!
X

దిశ, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో ప్రసారం చేసే వీడియో అడ్వర్టైజ్ మెంట్లకు, బహిరంగ ప్రదేశాల్లో వీడియో విజువల్ ప్రదర్శనకు ముందస్తుగా జిల్లా మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకట్రామ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి, వివిధ వార్తపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే పెయిడ్‌న్యూస్ గుర్తింపునకు ఎంసీఎంసీ కమిటీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో ప్రసారమయ్యే కథనాలను ఈ కమిటీ పరిశీలించి అతిక్రమణలు జరిగితే తగు చర్యలను తీసుకుంటుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమయ్యే అన్ని రకాల రాజకీయ ప్రచార ప్రకటనల కోసం ఎంసీఎంసీ కమిటీ నుంచి ముందస్తుగా అనుమతి పొందాలని తెలిపారు.

అదేవిధంగా పోలింగ్ రోజు, ముందు రోజు ప్రచురితమయ్యే ప్రింట్ మీడియా ప్రకటనలకు కూడా అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులకు మాత్రమే రాజకీయ ప్రచార ప్రకటనలకు జిల్లా ఎంసీఎంసీ కమిటీ అనుమతి జారీ చేస్తుందని స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన , రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబంధించి రాష్ట్రస్థాయి ఎంసీఎంసీ కమిటికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ వెంకట్రామ రెడ్డి తెలియజేశారు.

అనుమతి లేని ప్రకటనలను కేబుల్ , సాటిలైట్ ఛానెల్స్ ప్రసారం చేయవద్దనీ ఆయన తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేని రాజకీయ ప్రకటనలు ప్రసారం చేసే ఎలక్ట్రానిక్ మాధ్యమాలు , రాజకీయ పార్టీ అభ్యర్థులపై ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చర్యలను తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed