హన్మకొండలో పర్యటించిన జర్మనీ కౌన్సిలేట్ జనరల్.. మహిళలకు కీలక సూచనలు

by Shyam |
Consulate General of Germany
X

దిశ, హన్మకొండ: మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. శనివారం హన్మకొండ పర్యటనకు వచ్చిన జర్మనీ కౌన్సిలేట్ జనరల్(చెన్నై) క్యారీ స్టోన్‌ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో నగర మేయర్, కమిషనర్ ప్రావీణ్య, వీ-హబ్ ప్రతినిధులు కలిసి పూలమొక్కతో స్వాగతం పలికారు. అనంతరం స్వయం సహాయక బృందాల సభ్యులతో ముఖాముఖి ఏర్పాటు చేసిన సమావేశంలో కౌన్సిలేట్ జనరల్, మేయర్, కమిషనర్, వీ-హబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలేట్ జనరల్ మాట్లాడుతూ.. మహిళలచే నిర్వహింపబడుతోన్న వ్యాపారాలు వృద్ధి చెందాలని, తెలంగాణ ప్రభుత్వానికి జర్మనీ ప్రభుత్వం సహకారం అందజేస్తుందని తెలిపారు. గతంలో నగరంలో పర్యటించిన క్రమంలో మహిళలకు అందిస్తున్న ప్రోత్సాహం గురించి తెలుసుకున్నామని అన్నారు. ప్రాజెక్ట్ ‘‘హర్ ఎట్ నౌ’’, వీ-హబ్ కలిసి మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని వెల్లడించారు. వరంగల్ నగరంలో మహిళా సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులకు జర్మనీలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా తనవంతు సహకారం అందిస్తామన్నారు.

అనంతరం నగర మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం, వీ-హబ్ సహకారంతో 15 వ్యవస్థాపక కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతీ సంవత్సరం 20-30 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పార్కులు, నర్సరీలను స్వయం సహాయక బృందాలకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్‌కు కార్పొరేషన్ తరపున జనరిక్ మెడికల్ దుకాణాన్ని ఏర్పాటు చేయించి ఉపాధిని కల్పించామన్నారు. నగరానికి తొలిసారిగా విచ్చేసిన కౌన్సిలేట్ జనరల్‌ను మేయర్, కమిషనర్‌లు శాలువాతో ఘనంగా సత్కరించి, ఎస్‌హెచ్‌జీ సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను అందజేశారు. అంతకుముందు వీ-హబ్ ద్వారా శిక్షణ పొందిన ఎస్‌హెచ్‌జీ సభ్యులు పొందుతున్న ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వీ-హబ్ ఉపాధ్యక్షులు శకుంతల, పార్ట్నర్ షిప్ మేనేజర్ రమ్య, అదనపు కమిషనర్(ఇంచార్జీ) విజయలక్ష్మి, మెప్మా పీడీ భద్రు నాయక్, డీఎంసీఏడీఎంసీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed