విషాదం.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మేడి శంకరయ్య కన్నుమూత

by Sridhar Babu |
విషాదం.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మేడి శంకరయ్య కన్నుమూత
X

దిశ, మహదేవపూర్ : మహదేవపూర్ మండల మొదటి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మేడి శంకరయ్య కొద్దిసేపటి క్రితం మృత్యువాత పడ్డారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన ఆయన పేదలకు పెద్దన్నలా వ్యవహరించారు. సుదీర్ఘ కాలం సర్పంచ్‌గా చేసిన ఆయన 1987లో మండల వ్యవస్థకు మహదేవపూర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

1985లో..

గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నది పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న మహదేవపూర్ మండలం సురారం సర్పంచ్‌గా పనిచేస్తున్న క్రమంలో వరదలు ముంచెత్తాయి. లోతట్టు అటవీ పల్లెల్లో నివసిస్తున్న వారిని పరామర్శించేందుకు అప్పటి కలెక్టర్‌తో పాటు మేడి శంకరయ్య వెళ్లారు. అక్కడి ఆదివాసీ బిడ్డలు కలెక్టర్‌ను కాదని మేడి శంకరయ్య వద్దకు వచ్చి మాకు ఆకలి అవుతోంది.. తిండికి ఏమైనా చూడండి అని అడిగారు. దాదాపు 20 గ్రామాల ప్రజలు.. మనకు మేడి శంకరయ్య ఉన్నాడు.. తిండికి ఇబ్బంది లేదన్న ధీమాతో బ్రతికారు.

కిడ్నాప్..

అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు ప్రజా క్షేత్రంలో ఉండే మేడి శంకరయ్యను కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి, మంథని ఎమ్మెల్యేగా ఉన్న దుద్దిళ్ల శ్రీపాదరావు.. పీపుల్స్ వార్ డిమాండ్లను నెరవేర్చారు. లేనట్టయితే మహదేవపూర్ మండలంలో మేడి శంకరయ్యకు అనుకూలంగా ప్రభుత్వం లేదన్న ఆందోళనతో అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తారన్న సంకేతాలు వెళ్లాయి.

అటువంటి పరిస్థితుల్లో ఆయన్ను పీపుల్స్ వార్ చెర నుంచి విడిపించేందుకు ప్రభుత్వమే దిగి రావల్సి వచ్చింది. విశాఖ ప్రాంతంలో ఐఏఎస్ ఆఫీసర్ల కిడ్నాప్ వ్యవహారంలో సర్కారు తలొగ్గిన తరువాత మళ్లీ మేడి శంకరయ్య విషయంలోనే ప్రభుత్వం పీపుల్స్ వార్ చేసిన డిమాండ్లను నెరవేర్చింది. అంటే ఆ ప్రాంత ప్రజల్లో శంకరయ్య ఎంతటి చెరగని ముద్ర వేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కొద్ది సేపటి క్రితం మేడి శంకరయ్య చనిపోయారన్న విషయం తెలిసి అటవీ ప్రాంత ప్రజలు అల్లాడి పోతున్నారు.

Advertisement

Next Story