కాంగ్రెస్‌కు ‘గ్రేటర్’ పరీక్ష..!

by  |
కాంగ్రెస్‌కు ‘గ్రేటర్’ పరీక్ష..!
X

దిశ, న్యూస్‌బ్యూరో :

కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో టికెట్లు ఆశించే వారు గాంధీభవన్‌‌ వైపు తిరుగుతున్నారు. అయితే ప్రకటనలు చేసిన కాంగ్రెస్ పెద్దలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రణాళిక చేయడం లేదని తెలుస్తోంది. గ్రేటర్ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే సిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ కొంతమంది పేర్లను ఖరారు చేసుకుని జాబితాను సైతం అందించారని సమాచారం. కానీ పార్టీ క్షేత్రస్థాయిలో సర్వేలు చేసిన తర్వాతే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు నేతలు చెబుతున్నారు.

దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోవడం లేదని, తుదిజాబితా, ఇన్‌చార్జిలు ఖరారు కాలేదని నేతలు పేర్కొంటున్నారు. ఈసారి కూడా బాండ్ల సిద్ధాంతాన్ని ఆచరిస్తారా అనే సందేహాలు కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొన్నిడివిజన్లలో పోటీ చేసేందుకే కష్టంగా ఉంటే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తరహాలో రూ.20ల బాండ్లు రాసుకుని, గెలిస్తే పార్టీలోనే ఉంటామని బాండ్ల ప్రబోధకంగా తీసుకుంటే నేతలు ముందుకురారని చర్చిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ మరోసారి గ్రేటర్‌లో పాగా వేయాలని, రెండు కార్పొరేషన్లను తమ ఖాతాలోనే వేసుకోవాలని ప్రచారం మొదలుపెట్టింది. లాక్‌డౌన్ పరిస్థితులను కూడా అనుకూలంగా మల్చుకుంటోంది.

ప్రభుత్వ వ్యతిరేకతే ఆయుధం..

గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశాలు పెరిగాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా చేసిన సర్వే ప్రకారం గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ వ్యతిరేకత కొంత పెరిగిందని, దీన్ని అనుకూలంగా మల్చుకుంటే ఓట్లు పడతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనిపై పార్టీలోని గ్రేటర్ నేతలతో ఉత్తమ్, భట్టి, వీహెచ్ వేర్వేరుగా సమావేశమైనట్లు తెలుస్తోంది.

దీనికితోడు డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఎల్ఆర్ఎస్‌తో పాటు తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నరిజిస్ట్ర్రేషన్ల అంశం కలిసి వస్తుందని, క్షేత్రస్థాయిలో ఓట్లు రాబట్టుకునే నేతలకు టికెట్లు ఇవ్వాలని ప్రణాళిక చేసుకుంటున్నారు. అయితే పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్దకు యాత్ర చేస్తున్నవిషయం తెలిసిందే. దీన్నిపార్టీ శ్రేణులు ఏ విధంగా అనుకూలంగా తీసుకుంటాయనేది ప్రశ్నార్థకమే. ఎన్నికలకు వెళ్లే ముందే గ్రేటర్‌లో బస్తీబాట పెట్టాలని, దీంతో ప్రజల్లోకి వెళ్లే అవకాశాలున్నాయంటూ కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

బాధ్యత ఎవరిది..?

ప్రస్తుతం గ్రేటర్ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అంశం తేలడం లేదు. పార్టీలోని నేతల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఇది ప్రధాన సమస్యగా మారుతోంది. కొంతమంది ఇప్పటికే రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలా… లేక అంజన్ కుమార్‌కు ఇవ్వాలా, కాంగ్రెస్ సీనియర్ నేతలను గ్రేటర్ రంగంలోకి దింపాలా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. మొత్తం సీనియర్లను కొన్ని డివిజన్లకు బాధ్యత వహించే విధంగా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికే సీనియర్లం మేం.. గ్రేటర్ బాధ్యతలు మాకెందుకు అనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది.

కానీ గ్రేటర్‌లో కచ్చితంగా పాగా వేయాలని, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకోవాలని పార్టీ నేతలు సీనియర్లను కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా కలిసి వస్తారో చూడాల్సిందే. గ్రేటర్ పరిధిలో కొన్నిచోట్ల పార్టీకి అభ్యర్థుల తాకిడి ఎక్కువ లేకున్నా, మరికొన్ని డివిజన్లలో మాత్రం కొంత పోటీ ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులపై సర్వే పూర్తి చేయాల్సి ఉండగా, ఇంకా నేతలు దానిపై దృష్టి పెట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed