కాంగ్రెస్‌లో ‘పీసీసీ’ కల్లోలం

by Anukaran |
కాంగ్రెస్‌లో ‘పీసీసీ’ కల్లోలం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. టీపీసీసీ కొత్త చీఫ్‌తో పాటు సీఎల్పీ, అనుబంధ సంఘాలు, ప్రధాన పార్టీ కమిటీలో మార్పులు తీసుకొస్తున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ల వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో అగ్గి రాజుకుంటోంది. బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానాన్ని కలిసేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తుండగా.. అక్కడకు వెళ్లేందుకు అనుమతి లేని నేతలు లేఖలు రాస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌లో కల్లోలం నెలకొంది. టీపీసీసీ చీఫ్ ప్రకటన తర్వాత ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే ఉత్కంఠ కూడా నెలకొంది. మరోవైపు ప్యాకేజీ తీసుకున్నారంటూ ఆగ్రహంగా మాట్లాడిన సీనియర్ నేత వీహెచ్‌పై అధిష్ఠానం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీహెచ్ వ్యాఖ్యలపై వివరణ అడిగి, ఆయనకు నోటీసు జారీ చేయనున్నట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. వీహెచ్ చేసిన మరో ప్రకటన కూడా చర్చగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాంగ్రెస్‌లోకి వస్తే పీసీసీ చీఫ్ ఇప్పిస్తానంటూ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం పెరిగిందంటూ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

పీసీసీ చీఫ్‌‌ ఎంపికపై కాంగ్రెస్‌లో రగడ రచ్చకెక్కింది. సీనియర్ల అసంతృప్తితో కాంగ్రెస్‌ అధిష్ఠానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పుంజుకునేందుకు చాలా అవకాశాలున్నాయని, దూకుడుగా ఉండే వ్యక్తికే టీపీసీసీ అధ్యక్ష పదవి‌ ఇవ్వాలని హైకమాండ్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్​పేరు దాదాపుగా ఖరారైందనే సంకేతాలు వచ్చాయి. కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్​బాబు కూడా పోటీ పడటంతో వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సీడబ్ల్యూసీ ఆహ్వానితుడిగా వెంకట్​రెడ్డి, సీఎల్పీగా శ్రీధర్​బాబు, ప్రచార కమిటీ చైర్మన్‌గా భట్టీతో పాటు వర్కింగ్​ ప్రెసిడెంట్లుగా సంపత్, మధుయాష్కీ, షబ్బీర్ అలీని నియమిస్తారని, కమిటీలో చాలా మార్పులు ఉంటాయని పార్టీ నేతలు లీకులిస్తున్నారు. అయితే సీనియర్లలో చాలా మంది రేవంత్‌ను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లు మినహా.. మిగిలిన నేతలు, దాదాపు 21 జిల్లాల డీసీసీ అధ్యక్షులు రేవంత్​నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. దీంతో సీనియర్లను సముదాయిస్తూ రేవంత్​రెడ్డికి పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం భావిస్తోంది. దీని కోసమే టీపీసీసీ చీఫ్ ప్రకటన ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

వీహెచ్​అంశంపై నివేదిక..

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రకటనలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. వీహెచ్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఠాగూర్‌ సీరియస్‌ అయ్యారని, వీహెచ్‌ వ్యాఖ్యలు, పేపర్‌ క్లిప్పింగ్స్‌ను రాష్ట్ర కార్యదర్శి బోస్‌రాజు ఇప్పటికే ఠాగూర్‌కు పంపారని తెలుస్తోంది. ఠాగూర్ అమ్ముడుపోయాడంటూ వీహెచ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

తొందరపాటు వద్దంటూ జగ్గారెడ్డి లేఖ

తెలంగాణ పీసీసీ ఎన్నికపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దంటూ సోనియా గాంధీ, రాహుల్‌, ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో బీజేపీకి ఎమ్మెల్యేలుగా గెలిచే నేతలు లేకపోవడంతో రాజకీయంగా ఎదగడానికి ఆ పార్టీ ప్లాన్‌ చేస్తోందని, టీఆర్‌ఎస్‌-ఎంఐఎం పార్టీలను పరోక్షంగా బీజేపీ వాడుకుంటోందని లేఖలో జగ్గారెడ్డి పేర్కొన్నారు. సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో జానారెడ్డి నాయకత్వంలోనే ముందుకెళ్లాలని, పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని, పీసీసీ చీఫ్‌ ఎన్నిక ప్రక్రియ ఆపాలని లేఖలో కోరారు.

రేవంత్​పేరును బహిరంగంగానే చెప్పా..

టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిపై కూడా వీహెచ్ విమర్శలు చేయడంపై మల్లు రవి శనివారం స్పందించారు. మాణిక్కం ఠాగూర్‌, ఇతర నేతలపై వీహెచ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివి సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఎవరికీ చెంచాగిరీ చేయాల్సిన అవసరం లేదని, తమ ప్రాంతవాసుడైన రేవంత్‌రెడ్డి పార్టీ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారని, ఆయనకు పీసీసీ పదవి ఇవ్వాలని తాను బహిరంగంగానే మీడియాకు చెప్పినట్లు పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్‌కు వీహెచ్ ఆఫర్​..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు వి.హనుమంతరావు ఆఫర్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే పీసీసీ చీఫ్‌ పదవి ఇప్పిస్తానంటూ ప్రకటించడం మళ్లీ వివాదంగా మారింది. బీసీలకు పీసీసీ చీఫ్‌ ఇవ్వాలన్నందుకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, బెదిరింపులకు భయపడనని, పార్టీ కోసం ప్రాణం పోయినా ఫరవాలేదన్నారు. ఏపీలో 27 శాతం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షించారని, అప్పటి వంగవీటి రంగా తర్వాత పవన్‌కల్యాణ్‌కు మంచి వేవ్ ఉందంటూ హనుమంతరావు పేర్కొన్నారు. టీడీపీని నిండా ముంచిన రేవంత్‌రెడ్డి.. పీసీసీ పదవి చేపడితే కాంగ్రెస్‌ పార్టీనీ బొందపెడతాడని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed