కేసీఆర్ అసమర్థుడు.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్

by Shyam |   ( Updated:2021-07-08 12:10:50.0  )
MP Uttam Kumar Reddy
X

దిశ, కోదాడ: కృష్ణానది జలాల విషయంలో తెలంగాణ రైతాంగం మోసపోతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం ఏంటని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం కోదాడ పట్టణంలో ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం నుంచి 11 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే పట్టించుకోని కేసీఆర్‌కు ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే హక్కు లేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా.. పట్టించుకోని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత అని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో కుమ్మక్కై అలాయ్.. బలాయ్ చేసుకుంటూ నోరు మెదపడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్.. తెలంగాణ ప్రజానీకాన్ని తాకట్టు పెట్టి. లక్షల కోట్లు బ్యాంకుల నుండి రుణాలు తెచ్చి. కేవలం 3 టీఎంసీల నీళ్ల కోసం లక్షా 18 వేల కోట్లు ఖర్చు పెట్టారని ఎద్దేవా చేశారు.

8 శాతం కమీషన్ల కోసం అడ్డగోలుగా లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేండ్ల కింద రూ. 69 వేల కోట్లుగా ఉన్న అప్పు, ప్రస్తుతం నాలుగు లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కలసికట్టుగా పనిచేసి 2023లో అధికారంలోకి తీసుకోస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ నారాయణ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు పార సీతయ్య, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, చింతలపాటి శ్రీనివాసరావు, బషీర్, అన్ని మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed