కేసీఆర్, కేటీఆర్‌లకు ఆవిషయం తట్టడం లేదా !

by Shyam |
కేసీఆర్, కేటీఆర్‌లకు ఆవిషయం తట్టడం లేదా !
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలిస్తే శ్రీశైలం విద్యుదుత్పత్తి నిలిచిపోయి తెలంగాణలో చీకటి కమ్ముకుంటుందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన గాంధీ‌భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడి కొత్త విద్యుత్ ప్రాజెక్టుల కోసం ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు. ఏపీ జీవో 203 అమలైతే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారడంతో పాటు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు మూతపడే పరిస్థితి ఉంటుందన్నారు. కృష్ణాజలాలపై జగన్ మాటలను కేసీఆర్ సమర్ధిస్తున్నడని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జుసాగర్, పులిచింతలలో విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు 6,500 మెగావాట్ల సామర్థ్యం ఉందని, విద్యుత్ వినియోగం ప్రకారం ప్రాజెక్టుల విభజన చేయాలని ఆ నాడు జైపాల్‌రెడ్డి సూచించారని గుర్తుచేశారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా పెట్టిన రాగి సంకటి తిని కేసీఆర్ అలా మాట్లాడుతున్నారని, తెలంగాణలో నీళ్లు, నిధులు ఏపీకి… నియామకాలు కేసీఆర్ కుటుంబానికి దక్కాయని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే విద్యుత్ ప్రాజెక్టులు చచ్చిపోతాయన్న విషయం, అపర మేధావి కేసీఆర్, బాల మేధావి కేటీఆర్‌కు తట్టడం లేదా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పులు, వైఎస్‌‌‌ఆర్ మూటలు మోసిన వ్యక్తి కేసీఆర్ అని దుయ్యాబట్టారు. అన్ని పార్టీలతో పొత్తుపెట్టుకున్నది, మాగం రంగారెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసం ఎమ్మెల్యేలను అమ్ముకున్న చరిత్ర కేసీఆర్‌‌దేనని రేవంత్ ఆరోపించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న పోతిరెడ్డిపాడు జీవో 203కి వ్యతిరేకంగా ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed