ఉప్పెన సృష్టిస్తా.. కేసీఆర్ ఫాం హౌస్ కొంట : రేవంత్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-02-16 13:38:57.0  )
Congress MP Revanth Reddy
X

రైతుల భూములను లక్షల రూపాయలకు ఎకరా చొప్పున కొనుగోలు చేసి కోట్లకు కంపెనీలకు అప్పగిస్తున్నారని, ఫార్మాసిటీ పేరుతో పచ్చని పంటపొలాను విషతుల్యం చేసేందుకు కేసీఆర్​ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఎకరాకు 25 లక్షల చొప్పున ఇస్త.. నీ ఫాం హౌస్​ కొంట.. అమ్ముతవా.. ఓకే అంటే 48 గంటల్లో పైసలిచ్చేస్త.. ఏమంటవ్ కేసీఆర్​’ అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆశీస్సులు, ఏఐసీసీ అనుమతితో తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతు పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఇద్దరు బేరగాళ్లు మోడీ, అమిత్ షా.. దళారులైన అదానీ, అంబానీలకు దేశాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: అభివృద్ధి పేరుతో ఫార్మాసిటీని ఏర్పాటు చేసి పచ్చని పంట పొలాలను విషతుల్యం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఏర్పాటు చేసిన రైతు రణభేరి సభలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి భూములను రూ. లక్షలకు కొనుగోలు చేసి కోట్ల రూపాయలకు కంపెనీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఎకరాకు రూ.25 లక్షల చొప్పున కేసీఆర్ ఫాం హౌస్ స్థలాన్ని అమ్మితే 48గంటల్లో కొంటానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆశీస్సులు, ఏఐసీసీ అనుమతితో తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతు పాదయాత్ర చేస్తానని, తన పాదయాత్రతో ఉప్పెన సృష్టిస్తానని.. ఉప్పెనలా కేసీఆర్‌ను కప్పేస్తానని అన్నారు. ఇద్దరు బేరగాళ్లు మోడీ, అమిత్ షా.. దళారులైన అదానీ, అంబానీలకు దేశాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ మూడు రోజులకే మోడీ ముందు మోకరిల్లారని ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేసేందుకు ఇద్దరూ ఒక్కటయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి రైతు వ్యతిరేక చట్టాలపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. కాగా.. రేవంత్ రెడ్డి నిర్వహించిన రైతు రణభేరి సభకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. అంతేకాదు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీడగా పేరున్న సూరీడు రణభేరి సభలో ప్రత్యక్షం కావడంతో కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తారని ఆశించిన సభ వెలవెలబోయింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ్ కుమార్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed