నా పాదయాత్ర పదవి కోసం కాదు : రేవంత్ రెడ్డి

by Shyam |
Congress MP Revanth Reddy
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరూ గుజరాత్ నుంచి వచ్చిన బేరగాళ్లని, వీరిద్దరూ కలిసి దేశాన్ని అంబానీ, అదానికు కట్టబెట్టేందుకే నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారని కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి ప్రారంభించిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ పట్టణానికి శనివారం చేరుకుంది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోడీ ఇద్దరూ కార్పొరేట్ వ్యవస్థకు దాసోహం అయ్యారని ఆరోపించారు. ‘చాయ్ వాలా.. మందు వాలా దొనో మిల్కే దేశ్ కో బేచ్ రే’ అని ఎద్దేవ చేశారు. పదవి కోసం తాను పాదయాత్ర చేయడం లేదని, రైతులకు భరోసా కల్పించేందుకు చేస్తున్నానని స్పష్టం చేశారు. రైతు ఉద్యమానికి జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటేనన్నారు. గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలుండవని, వ్యవసాయ మార్కెట్లు ఉండవని, ఏ పంటకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కేంద్రం నిర్ణయాలకు వ్యతిరేకంగా రైతులకు అండగా నిలబడాల్సిన కేసీఆర్.. తన కొడుకు, బిడ్డ, అల్లుడికి ఏయే పదవులు కట్టబెట్టాలనే ఆలోచిస్తున్నారని విమర్శించారు. ‘తండ్రి అండతో వచ్చే పదవిని అనుభవిస్తున్న సన్నాసివి.. త్యాగమంటే నీకేం తెలుసు’ అని కేటీఆర్‌ను అని విమర్శించారు.

ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. రైతు భరోసా యాత్ర ప్రజా సమస్యలను బయటకి తీస్తుందన్నారు. రైతులను, మేలుకొలపడానికే రేవంత్ ఈ పాదయాత్ర చేపట్టారని తెలిపారు. ఓట్లు ఉంటే తప్ప సీఎం బయటికి రారని, తన కుటుంబంలో అందరికీ పదవులు ఇచ్చి ఇప్పుడు సీఎం పదవిని చెప్పుతో పోల్చడం సిగ్గుచేటని విమర్శించారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed