అసెంబ్లీలో ఎమ్మెల్యే సీతక్క ఫైర్

by  |
అసెంబ్లీలో ఎమ్మెల్యే సీతక్క ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ అంశంపైన చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని ప్రకటిస్తూ మరోవైపు చట్టసభలో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల అభిప్రాయాలను వినడానికి కూడా ఈ సభ సిద్ధంగా లేదని, ఎంతసేపూ ఆహా.. ఓహో.. అని ప్రభుత్వానికి డబ్బా కొట్టుకోవడం వరకే పరిమితమైందన్నారు.

అంతా బాగుంది అనుకుంటే ఇక సభ నిర్వహించడమెందుకని ప్రశ్నించారు. పరిస్థితులు ప్రభుత్వం భావిస్తున్నదానికి భిన్నంగా ఉన్నందుకే గదా విపక్షాలు ప్రస్తావిస్తోంది అని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా గొంతులు నొక్కితే ప్రభుత్వానికి ఏం ప్రయోజనమని ఆమె ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, స్వల్పకాలిక చర్చ.. ఇలా ఎక్కడా కూడా విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమే దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లులపై చర్చ సందర్భంగా సీతక్క సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

నిరుద్యోగుల ఆశలపై నీళ్ళు చల్లుతోంది

తెలంగాణ రాష్ట్ర సాధనకై జరిగిన ఉద్యమం సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉవ్వెత్తున కదిలారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఆశించారని, కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయని సీతక్క వ్యాఖ్యానించారు. ఆయుష్ విభాగంలో వైద్య ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు పెంపు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న 58 ఏళ్ళ రిటైర్‌మెంట్ వయసును 65 ఏళ్ళకు పెంచడం నిరుద్యోగుల ఆశలపై నీళ్ళు చల్లడమేనన్నారు. అవసరాల కోసం ఒకటి రెండు సంవత్సరాల వయసును పెంచితే పర్వాలేదు గానీ ఏకంగా ఏడేళ్ళు పెంచడం సముచితం కాదన్నారు.

అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందన్నారు. నిజానికి బోధనా సిబ్బంది కొరత ఉన్నందున ఇప్పుడు పదవీ విరమణ వయసు పెంచి తరగతులకు ఇబ్బంది లేకుండా ఈ బిల్లును తెచ్చినట్లు ప్రభుత్వం సమర్థించుకోవచ్చుగానీ వీటిని భర్తీ చేయడంపై ఇంతకాలం ఎందుకు చొరవ తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. రిక్రూట్‌మెంట్ సకాలంలో జరిగినట్లయితే ఈ కొరత ఏర్పడేది కాదని, ఇప్పుడు ఈ బిల్లును తీసుకురావాల్సిన అవసరం వచ్చేది కాదని అన్నారు. ఈ ఏడేళ్ళ పదవీ విరమణ వయసు పెంపుతో ఉద్యోగాలను ఆశిస్తున్నవారికి అవకాశం పోయినట్లేనని, వారి ఏజ్ కూడా ఇకపైన అర్హతకు పనికిరాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఒరిగిందేమీ లేదని, ఉద్యోగం వస్తుందన్న ఆశ ఆరేళ్ళ తర్వాత కూడా అడియాసగానే మిగిలిందని అసెంబ్లీ ముందు ఇటీవల ఆత్మాహుతికి పాల్పడ్డ తెలంగాణ నాగులు ఇందుకు ఉదాహరణ అని సీతక్క గుర్తు చేశారు. జై తెలంగాణ నినాదం చేస్తూ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని, చివరకు చికిత్స ఫలించక చనిపోయాడని, కనీసం ఆయన మృతదేహానికి అధికారపార్టీ నేతలు నివాళులు అర్పించకపోవడం బాధాకరమన్నారు.

ఆయన పేరే ‘తెలంగాణ నాగులు’ అని, బండ్లగూడలో ఆయన ఇంటికి వెళ్లినప్పుడు మృతదేహంపై టీఆర్ఎస్ కండువా కనిపించిందని ఆమె గుర్తుచేశారు. కానీ టీఆర్ఎస్ నేతలు ఒక్కరు కూడా కనీసం నివాళులు అర్పించలేదని తెలిసిందన్నారు. 60 రోజుల లాక్‌డౌన్ సమయంలో కరోనా ప్రభావం అనేక రంగాలపై పడిందని, ప్రభుత్వం వారందరినీ ఆదుకోవడం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సీతక్క డిమాండ్ చేశారు.

స్పీకర్ తీరుపై భట్టి విక్రమార్క అసహనం

సీతక్క మాత్రమే కాక మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సభలో కొత్త చట్టాలను చేసే క్రమంలో ప్రతిపక్ష సభ్యుల అభిప్రాయాలను కూడా వినడానికి ప్రభుత్వం సుముఖంగా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. చట్టాలు చేసే ముందు అన్ని రకాల భిన్నాభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని, వారి అనుమానాలను నివృత్తి చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని, కానీ నోరు నొక్కే తీరులో మాట్లాడడానికే అవకాశం ఇవ్వకపోతే ఇక చట్ట సభకు అర్థమేముంటుందని ప్రశ్నించారు.

చట్టం చేసే ముందు మంచి చెడ్డల గురించి ప్రభుత్వం ఆలోచించాలని, తప్పుడు చట్టం చేస్తే అది రాష్ట్రానికి, ప్రజలకు మంచిది కాదన్నారు. ఎఫ్ఆర్‌బీఎం చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క అనేక అనుమానాలను లేవనెత్తారు. మరింతగా అప్పులు తీసుకోడానికి ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని, వీటిని కట్టలేక భవిష్యత్తులో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని, అంతిమంగా ప్రజలపై రుణభారం పెరుగుతుందన్నారు.

మంత్రి హరీశ్‌రావు వివరణ ఇచ్చినప్పటికీ అనుమానాలు నివృత్తి కాకపోవడంతో వాటి గురించి మరింత లోతుగా చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. కానీ స్పీకర్ మాత్రం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఓటింగ్ నిర్వహించారు. ఒకవైపు భట్టి విక్రమార్క తన అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నా స్పీకర్ మాత్రం మైక్ కనెక్షన్‌ను కట్ చేసి ఓటింగ్ ప్రక్రియకే మొగ్గుచూపారు.


Next Story

Most Viewed