ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు

by  |
ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు
X

దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్, మంత్రులు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. సచివాలయాన్ని, అందులోని బాత్రూమ్‌లను వాస్తు ప్రకారం కట్టించుకునే పనిలో వారు నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. మంగళవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సచివాలయం దర్వాజలు, కిటికీలపై సీఎం రివ్యూలు పెట్టడం బాధాకరమని, సీఎం వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇదే పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే రాష్ట్రంలో ఇంత హీనమైన పరిస్థితి ఉండేది కాదన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల ఒక బొమ్మ అని, ఆయన చాలా మంచివాడేనని, అయితే సీఎం కేసీఆర్ కీ ఇచ్చినప్పుడే ఈటల మాట్లాడుతారని విమర్శించారు. కరోనా విషయంలో ఏదైనా జరగరానిది జరిగితే ఆ నిందను ఈటెల మీద వేస్తారని, మంచి జరిగితే మాత్రం కేసీఆర్ తన ఖాతాలో వేసుకుంటాడని, ఆ అపవాదును తెచ్చుకోవద్దని మంత్రి ఈటలకు సూచించారు. కరోనా అంశంపై త్వరలోనే తాము రోడ్డెక్కుతామని, ప్రభుత్వంతో తాడే పేడో తేల్చుకుంటామని జగ్గారెడ్డి ప్రకటించారు.



Next Story

Most Viewed