ప్రణబ్‌ సంతకంతోనే తెలంగాణ ఆవిర్భావం

దిశ, సిద్దిపేట: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ ప్రజలతో, తెలంగాణ ఉద్యమంతో, రాష్ట్ర రాజకీయాలతో ప్రత్యేక అనుబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి అన్నారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి, రాష్ట్ర నాయకుడు దరిపల్లి చంద్రం మాట్లాడుతూ… ప్రణబ్ ముఖర్జీ కృషి వల్లే తెలంగాణ రాష్ట్ర కలసాకారం అయిన సంగతి గుర్తు చేశారు. ఆయనకు రాష్ట్ర ప్రజలతో, ఉద్యమంతో, రాష్ట్ర రాజకీయాలతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచే రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రణబ్ ముఖర్జీకి స్పష్టమైన అభిప్రాయం ఉందన్నారు.

యూపీఏ-1 హయాంలో సబ్ కమిటీ ఛైర్మన్‌గా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో క్రియాశీల సభ్యుడిగా, చివరకు రాష్ట్రపతిగా ప్రతి దశలో ఆయన తెలంగాణ పట్ల నిశ్చితాభిప్రాయాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. CWCలో తెలంగాణ నిర్ణయం మొదలుకొని పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లుపై చర్చ జరిగి ఆమోదించడం వరకు ఆయనకు వివిధ రకాలుగా ప్రమేయం ఉందన్నారు. ప్రాథమిక స్థాయిలో బిల్లు రూపకల్పన ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు. చివరికి ఆయన సంతకంతోనే రాష్ట్రం ఆవిర్భవించిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారం చేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ విగ్రహాన్ని నూతనంగా నిర్మించబోతున్న సెక్రటేరియట్ ఎదుట ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

Advertisement