కేసీఆర్, కేటీఆర్.. సోనియా గాంధీ కాళ్లు మొక్కారు

by Shyam |
కేసీఆర్, కేటీఆర్.. సోనియా గాంధీ కాళ్లు మొక్కారు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు టెండర్ల ప్రక్రియ ఆపేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని లేకుంటే తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ద్రోహులుగా ఉంటారో, ప్రజల హృదయాల్లో నిలుస్తారో తేల్చుకోవాలని ఆదివారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఈనెల 5న కేబినెట్ సమావేశం ఉన్నా సీఎం లేదా సీనియర్ మంత్రులు అపెక్స్ కమిటీ జూమ్ మీటింగ్‌లో పాల్గొనే అవకాశాలున్నాయని, కానీ ఎందుకు దాటవేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం… ఏపీ ప్రభుత్వానికి టెండర్ల ప్రక్రియ ఆపేసి సమావేశానికి రావాలని ఆదేశించారని పేర్కొన్నారు. తెలంగాణ పోరాటం చేస్తేనే టీపీసీసీ వచ్చిందంటూ సీఎం కేసీఆర్ మాట్లాడడం బేకూఫ్‌గా ఉన్నాయని, సోనియాగాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని సీఎం కేసీఆర్ మాట్లాడిన విషయం మరోసారి గుర్తు చేస్తున్నామన్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ అంతా సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చినందువల్లే.. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్, హరీష్‌రావు మంత్రులు అయ్యారని, కవిత, సంతోష్‌లు ఎంపీలు అయిన విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. దళిత ఎమ్యెల్యేలు అడ్డగోలుగా మాట్లాడుతూ దళిత ద్రోహులుగా మిగిలిపోతున్నారని, దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంటే పోరాటం చేయకుండా దొర కింద పనిచేస్తే దళిత ద్రోహులుగా మిగిలిపోతారని, దళిత జాతి రత్నాలుగా ఉంటారా, దళిత ద్రోహులుగా ఉంటారా తేల్చుకోవాలని హితవు పలికారు.

Advertisement

Next Story