అధికార పార్టీకి తల వంచిన ఈసీ : మర్రి

by Shyam |
అధికార పార్టీకి తల వంచిన ఈసీ : మర్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పార్టీకి తల వంచిందని కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల విభాగం ఛైర్మన్​ మర్రి శశిధర్​రెడ్డి ఘాటుగా విమర్శించారు. గ్రేటర్​ ఎన్నికల విషయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా టీఆర్​ఎస్​కు అనుకూలంగా పని చేసిందన్నారు. గాంధీభవన్​లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇలాంటి ఎన్నికల సంఘం ఉండటం దురదృష్టకరమని, ప్రజాధనం వృథా చేయడమేనన్నారు. కనీసం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో చర్చించడం లేదని, చర్చించినా సలహాలు తీసుకునే పరిస్థితుల్లో ఎస్​ఈసీ లేదని మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియను ప్రహాసనంగా మార్చటంలో ఎన్నికల కమిషన్​ ఘోరంగా విఫలమైందని, వరదలు, కోవిడ్​ నేపథ్యంలో కొంత సమయం ఇవ్వాలని రాజకీయ పక్షాలన్నీ కోరినా పెడచెవిన పెట్టారన్నారు.

గ్రేటర్​ ఎన్నికల్లో విపరీతంగా ప్రలోభాలకు గురి చేశారని, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారని, వరద బాధితులకు ఇచ్చే సాయాన్ని కూడా ఓట్ల కొనుగోలుకు వాడుకున్నారని మర్రి శశిధర్​రెడ్డి ఆరోపించారు. ఓట్ల లెక్కింపునకు ముందు రాత్రి పూట ఇచ్చిన ఉత్తర్వులు అర్థరహితంగా ఉన్నాయని, ఇలా గతంలో ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. ఎల్​బీ స్టేడియంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, విచ్చలవిడిగా ఫ్లెక్సీలు పెడితే కాంగ్రెస్​ పార్టీ ఎస్​ఈసీకి ఫిర్యాదు చేసిందని, కనీసం ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారి విశ్వజిత్​ కూడా లెక్క చేయలేదని విమర్శించారు. కనీసం రిగ్గింగ్​ను కూడా అరికట్టలేదని, రిగ్గింగ్​కు సహాకరించారని, చనిపోయి వ్యక్తి ఓటు కూడా ఒక పోలింగ్​ కేంద్రంలో పోలైందని, దీని ప్రకారం ఎన్నికల సంఘం సిబ్బంది పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గ్రేటర్​ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకుంటామని చెప్పారు. ఎన్నికల సంఘం మీద రాష్ట్రమంతా నమ్మకం కోల్పోయారని ఇది మంచి పరిణామం కాదని మర్రి శశిధర్​రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed