ఈ క్షణం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది : కమల్‌నాథ్

దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలో రామమందిరం నిర్మాణం పై కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే, భూమిపూజకు సరిగ్గా నాలుగు రోజుల ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి కుష్బూ.. తాజాగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆలయ నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతిఒక్కరీ సమ్మతి మేరకే అయోధ్యలో రామమందిరం నిర్మాణం కల సాకారమవుతోందనీ.. ఈ నిర్ణాయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. ఈ క్షణం కోసమే దేశ ప్రజలంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రతిఒక్క భారతీయుడి సమ్మతి మేరకే ఆలయ నిర్మాణం సాకారం అవుతోందని.. ఇది భారత్‌లో మాత్రమే సాధ్యం” అని కమల్‌నాథ్ పేర్కొన్నారు.

కాగా, మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం రామాలయ నిర్మాణాన్ని స్వాగతించారు. దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ రామాలయం నిర్మాణం జరగాలని కోరుకున్నారనీ.. శ్రీరాముడు ప్రతి ఒక్కరీ విశ్వాసానికి కేంద్రమని ఆయన పేర్కొన్నారు. ”మన విశ్వాసానికి మూలం శ్రీరాముడు. దానిపైనే దేశం ఇవాళ ఇలా నడుస్తోందన్నారు.

అందుకే శ్రీరాముడి జన్మస్థలంలో ఆలయ నిర్మాణాన్ని మేము స్వాగతిస్తున్నాం దిగ్విజయ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత నరోత్తమ్ మిశ్రా తనదైన శైలిలో స్పందించారు. ”కొందరు విమర్శించడమే అలవాటుగా పెట్టుకుంటారు.

అందులోనే మంచిని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. కనీసం విమర్శల్లోనైనా శ్రీరాముడిని గుర్తుచేసుకున్నందుకు సంతోషం..” అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రామాలయ నిర్మాణాన్ని జాప్యం చేసేందుకే ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.

Advertisement