ఏపీకి లాభం చేసేందుకే కేసీఆర్ ప్రయత్నం

by Shyam |
ఏపీకి లాభం చేసేందుకే కేసీఆర్ ప్రయత్నం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, ఏపీ ప్రతిరోజు 11టీఎంసీలు శ్రీశైలం బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేయడానికి జీవో విడుదల చేస్తే స్పందన లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 5న అపెక్స్ భేటీకి పిలిస్తే కేసీఆర్ పట్టించుకోకుండా 20వ తేదీ తర్వాత పెట్టమనడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈనెల 20లోపు పోతిరెడ్డిపాడు టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందని, అందుకే సీఎం కేసీఆర్ అపెక్స్ భేటీని వాయిదా వేయాలన్నారని విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేసే సీఎంను ఇప్పటిదాకా చూడలేదని, తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్ అని, 19వ తేదీలోపు ఏపీ చేసే టెండర్ ప్రక్రియను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకోవాలని భట్టి డిమాండ్ చేశారు.

పోతిరెడ్డిపాడు నిర్మిస్తే ఖమ్మం జిల్లా ప్రజలు జొన్నచేళ్లలో రేగళ్లు ఏరుకునే పరిస్థితి మళ్లీ వస్తుందన్నారు. ఏపీకి న్యాయం చేస్తూ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో దళితులపై దాడులు ఆగడం లేదని, దళిత వర్గానికి రాజ్యాంగ రక్షణ కరువు అయిందని, దళితులపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన లేదన్నారు. దళితులపై జరుగుతున్న దాడులపై గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తామన్నారు. గజ్వేల్‌లో ప్రభుత్వం చేసిన తప్పు వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్ విజృంభిస్తుందని ఆరోపించారు. పట్టణాల నుంచి గ్రామాలకు కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed