సాగర్​ పోరుపై కాంగ్రెస్ సీరియస్.. రంగంలోకి రేవంత్ రెడ్డి

by Anukaran |
Revanth Janareddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న నాగార్జున సాగర్​ ఉప ఎన్నికపై కాంగ్రెస్​ ఆఖరి ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్​ నుంచి పోటీ చేస్తున్న జానారెడ్డి ముందుగా గెలుస్తారని ప్రచారం జరిగినా పరిస్థితులు మారుతూ వస్తున్నట్లు భావిస్తున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ప్రచారంతో పాటుగా పలువురు కీలక నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులను అక్కడే మోహరించింది. ఈ నెల 14న సీఎం కేసీఆర్​ కూడా సభను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్​ పార్టీ ప్రచారాన్ని మరింత స్పీడ్​ పెంచింది. ఇప్పటి వరకు కొంతమంది నేతలతోనే సాగిస్తున్న ప్రచారానికి రాష్ట్రంలోని కాంగ్రెస్​ పార్టీ సీనియర్లంతా రావాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా శుక్రవారం నుంచి పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్​రెడ్డి ప్రచారాన్ని మొదలుపెట్టుతున్నారు. ఇది కాంగ్రెస్​ పార్టీకి కొంత మేరకు కలిసి వస్తుందని ఆశిస్తున్నారు.

ఆ వారం రోజులు సీరియస్​

సాగర్​ ప్రచారంలో ఈ వారం రోజులు హస్తం నేతలు సాగర్​కు వెళ్లాలని పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​ కూడా పిలుపునిచ్చారు. రెండు రోజుల కిందట పార్టీ నేతలతో జూమ్​ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అంతకు ముందు నుంచే ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రచారంలో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం నేటి నుంచి ఎంపీ రేవంత్​రెడ్డి కూడా ప్రచారానికి వెళ్తున్నారు. జానారెడ్డికి మద్దతుగా రేవంత్​రెడ్డి ప్రచారం చేస్తారా… లేదా అనేది ఇప్పటి వరకు సందేహంగానే ఉండేది. కానీ ఆయన ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొవిడ్​ పాజిటివ్​తో దాదాపు 20 రోజులు ఐసోలేషన్​లో ఉన్న ఆయన నేటి నుంచి ప్రచారంలో పాల్గొంటున్నారు. రేవంత్​ ప్రచారం చేస్తే కొంత కలిసి వస్తుందని భావిస్తున్నారు. రేవంత్​తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్​ నేతలంతా సాగర్​కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Next Story