సైలెంట్‌గా భట్టి.. ఢిల్లీ నుంచి పిలుపు

by Shyam |   ( Updated:2021-07-01 05:05:44.0  )
CLP leader Bhatti Vikramarka
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామాకం అయిన తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైలెంట్ అవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో భట్టికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో అధిష్టానం ఏం చెబుతుందనే దానిపై పొలిటికల్, కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పీసీసీ పదవిపై భట్టి భారీ ఆశలు పెట్టుకున్నారు. దీని కోసం కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు.

ఒక దశలో భట్టికి పీసీసీ పదవి దక్కడం ఖాయమనే వార్తలు కూడా వినిపించాయి. భట్టినే కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ సీఎం కేసీఆర్‌తో భట్టి భేటీ కావడం, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంను కలవడం పార్టీలో దుమారం రేపింది. ఈ భేటీ జరిగిన వెంటనే రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌తో భేటీ వ్యవహారమే భట్టి కొంప ముంచిందని, పీసీసీ పదవి రాకపోవడానికే అదే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ని ప్రకటించిన నాటి నుండి భట్టి సైలెంట్ అయ్యారు. అలకబూనారా? లేక పార్టీ మారేందుకు యోచిస్తున్నారా? అని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం నుండి పిలుపు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రగతి భవన్ కి వెళ్లి సీఎంని కలవడంపై భట్టికి అధిష్టానం క్లాస్ తీసుకోనుందా? లేక టీపీసీసీ ఇవ్వలేదు కాబట్టి మరేదైనా పదవి బాధ్యతలు అప్పగించి బుజ్జగిచ్చేందుకు రమ్మని పిలిచిందా అనేది సస్పెన్స్. కాగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ తో భట్టి భేటీ అనంతరం అసలు విషయం ఏమిటనేది తెలిసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed