బీజేపీలోకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి..?

by Aamani |
బీజేపీలోకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి..?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, నిర్మల్ మాజీ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన భారతీయ జనతా పార్టీలో చేరితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది. ఆయన కాంగ్రెస్‌ను వీడేందుకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధమైందని… బీజేపీలో ఎప్పుడు చేరేది అనే విషయాన్ని ప్రకటిస్తారని ఆయన ఆంతరంగికుడు ఒకరు తెలిపారు. వాస్తవానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన హైదరాబాద్లో పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఒక దశలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్న భూపేంద్ర యాదవ్ హైదరాబాద్‌లో మహేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్తున్నట్లు.. అక్కడే ఆయన బీజేపీలో చేరే విషయాన్ని ప్రకటిస్తారని జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. చివరి క్షణంలో పార్టీ మారే విషయం సందిగ్ధంలో పడినట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్‌లోనే కొనసాగాలని ఒత్తిడి..?

మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడకుండా ఆయనపై ఒత్తిళ్లు మొదలైనట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ స్థాయిలో మహేశ్వర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి తోనూ దగ్గరి మిత్రుత్వం ఉంది. అలాగే నిర్మల్ నియోజక వర్గంలో మహేశ్వ ర్ రెడ్డికి మైనారిటీ వర్గాల్లో బలమైన పట్టు ఉంది. జిల్లాలో ముఖ్యంగా నిర్మల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ కు గ్రామగ్రామాన మంచి కేడర్ ఉన్నది. బీజేపీ పరిస్థితి ప్రస్తుతం ఉద్వేగభరితంగా ఉండటం.. పొలిటికల్ వేవ్ కనిపిస్తున్నదని.. అయితే అది దీర్ఘకాలంలో కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంలో ఆయన కొందరు సీనియర్ రాజకీయ విశ్లేషకులతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మెరుగుపడుతుందని..సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్ల కాలం ఉందని ఇప్పటి నుంచి పార్టీ మారడం ద్వారా పెద్ద ప్రయోజనం ఉండదని..ఎదుటి పక్షాలు దాడి కొనసాగిస్తారని ఆయనకు కొందరు సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారే విషయంపై తర్జనభర్జన పడుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed