పార్ట్‌టైం లీడర్స్.. పరేషాన్‌లో కేడర్

by Shyam |   ( Updated:2020-02-23 06:03:21.0  )
పార్ట్‌టైం లీడర్స్.. పరేషాన్‌లో కేడర్
X

రంగారెడ్డి, దిశ: ఓటమికి వెరవకుండా కార్యకర్తల్లో ఉత్సాహం నింపి ముందుకు నడిపించే నాయకుడు లేకపోవడం.. కాంగ్రెస్​ కార్యకర్తల్లో ఆందోళనకు కారణమవుతోంది. జాతీయస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యతోనే సతమతమవుతోంది. జిల్లాలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి ఇప్పటికీ పార్ట్‌టైం లీడర్‌గానే వ్యవహరించడం, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి బడంగ్​పేట్, బాలాపూర్​ ప్రాంతాలకే పరిమితం కావడం.. పార్టీ పురోగతికి అడ్డంకిగా మారుతోంది. జిల్లాలో కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసే సరైన నేతలు లేకపోవడం ఆ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తోంది. నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలతో జిల్లాలో బలమైన పార్టీగా ఉన్నా ఎన్నికల్లో విజయం సాధించకపోవడానికి నాయకత్వలోపమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే కాంగ్రెస్​ నాయకులకు ఎటువంటి భరోసా లేకపోవడంతో వారంతా పార్టీని వీడే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో నిరంతరం పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలను నాయకులే మోసం చేస్తున్నట్టు అవుతోంది.

సమీపిస్తున్న జీహెచ్​ఎంసీ ఎన్నికలు

గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​(జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ కాంగ్రెస్ ఎలాంటి దిద్దుబాటు చర్యలకు పూనుకోకపోవడం చూస్తుంటే ఈ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదనే సంకేతాలే వెలువడుతున్నాయి. కాంగ్రెస్​జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి గాంధీభవన్‌లోని జిల్లా కార్యాలయంలో ప్రెస్​మీట్‌కు హాజరవడం.. బడంగ్​పేట్, బాలాపూర్ చౌరస్తాలో కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప, పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపై పోరాడిన దాఖలాలు లేవు. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనబడింది. పైగా జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లుంటే రంగారెడ్డి జిల్లాలోనే 45 డివిజన్లుండటం విశేషం. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పట్టణప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. అయితే ఎల్బీనగర్​ నియోజకవర్గం ఇన్‌చార్జిగా వ్యవహరించిన సుధీర్​ రెడ్డి కాంగ్రెస్ ​నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరారు. మహేశ్వరం ఇన్‌చార్జిగా వ్యవహరించిన సబితా ఇంద్రారెడ్డి సైతం కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆమె కుమారుడు, రాజేంద్రగనర్​ ఇన్‌చార్జి కార్తీక్ రెడ్డి కూడా టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులకు నాయకత్వ భరోసా లేకపోవడంతో.. పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం.

Read also..

రాజ్యసభకు బూర?

Advertisement

Next Story