సీఎం వద్దంటూ గవర్నర్‌కు మంత్రి లేఖ

by Shamantha N |
సీఎం వద్దంటూ గవర్నర్‌కు మంత్రి లేఖ
X

బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీఎంపై ఆ రాష్ట్ర మంత్రి ఈశ్వరప్ప గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం, ‘ఆపరేషన్ కమల్’ వివాదంపై విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఇదే విషయమై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార యంత్రాంగం విఫలమైందనడానికి కె.ఎస్. ఈశ్వరప్ప ఫిర్యాదే సాక్ష్యమని అన్నారు. యడియూరప్ప ప్రభుత్వం అవినీతి, బంధుప్రీతి లో కూరుకుపోయిందని విమర్శించారు. ఈశ్వరప్ప తన రాజకీయ జీవితంలో తొలిసారి మంచి పని చేశారని చెప్పారు.

బీజేపీ కేంద్ర నాయకత్వం దీనిపై నిష్పక్షపాత విచారణ జరపాలే తప్ప ఈశ్వరప్ప గొంతు నొక్కే చర్యలకు పాల్పడవద్దని కోరారు. 2018లో అవినీతిపై ప్రధాని మోడీ మాట్లాడుతూ చెప్పిన ‘నేను తినను, తిననివ్వను’వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. ‘మోడీ గారు, మీ నినాదం మార్చుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడంతా ‘నేను తింటాను.. మీరు తినండి’ అన్నట్టు మారిందని వ్యాఖ్యానించారు. ఈశ్వరప్ప వ్యవహారంతో పాటు ఆపరేషన్ కమల్ వివాదంలో విచారణకు కోర్టు ఆదేశమివ్వడంతో సీఎం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నైతికత గురించి నీతులు చెప్పే బీజేపీ.. చేతల్లో మాత్రం దానిని చూపించడం లేదని మండిపడ్డారు. కాగా, ఈశ్వరప్ప ఫిర్యాదుపై యడియూరప్ప స్పందించారు. ఆ ఆరోపణలు నిరాధారం అని తెలిపారు. ఇదే విషయమై ఆయన కేంద్ర నాయకత్వం దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు బీజేపీ నాయకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed