- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భద్రాద్రిలో ఉన్నది రామచంద్రుడా.. రామ నారాయణుడా?
దిశ ప్రతినిధి, ఖమ్మం: కొన్నేళ్లుగా భద్రాద్రి ఆలయంలో రాముడి నామానికి సంబంధించి రగడ జరుగుతూనే ఉంది. శ్రీరామనవమి సమీపిస్తుందంటే కొంతకాలం ముందు నుంచే శ్రీరాముడి పేరుకు సంబంధించి చర్చ తెరపైకి వస్తోంది. భద్రాచలంలో ఉన్నది స్వయంగా రామచంద్రుడని ఓ వర్గం చెబుతుంటే.. కాదుకాదు.. రామ నారాయణుడని మరో వర్గం వాదిస్తోంది. ఈ విషయమై మళ్లీ భద్రాచలంలో ఆందోళనలు ముదురుతున్నాయి. స్వామివారి పేరును కావాలనే మార్చే ప్రయత్నం చేస్తున్నారని భక్తులతో పాటు కొంత మంది ఆధ్యాత్మిక వేత్తలు ఆరోపిస్తున్నారు.
ఈ సందిగ్ధంపై సాధారణ భక్తులు ఇంతకీ భద్రాచలంలో ఉన్నది రామ చంద్రుడా..? లేక రామ నారాయణుడా? అనేది తేల్చాలని కోరుతున్నారు. ఇలాగే కొనసాగితే ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని, మనోభావాలు దెబ్బతినే ప్రమాదముందంటున్నారు. ఇదే విషయమై భద్రాచలంలో ఇప్పుడు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాముడి పేరును మార్చే ప్రయత్నం జరుగుతోందంటూ భక్తులు ఆలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరాహార దీక్షకు సైతం పూనుకున్నారు.
అసలేంటి వివాదం
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరి స్వయంగా శ్రీరాముడు నడయాడిన నేలగా కొలుస్తుంటారు. ఆ రామయ్య పేరుమీద భక్తరామదాసు ఆలయాన్ని నిర్మించాడు. అయితే కొన్నేళ్లుగా శ్రీరాముని కల్యాణం సందర్భంగా ఇక్కడి అర్చకులు స్వామివారి పేరును మారుస్తుండడంతో వివాదం మొదలైంది. భద్రాద్రి రామాలయంలో అనాదిగా వస్తున్న ఆచారంలో మార్పు జరుగుతోందంటూ ఆధ్మాత్మిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీతారాముల కల్యాణం సందర్భంగా వధువుగా మహాసాత్వి సీతాదేవి పేరు చెబుతూ, వరుడిగా ఏకపత్నీ వ్రతుడైన శ్రీరామచంద్రుని పేరు చెప్పకుండా, శ్రీ రామ నారాయణుని పేరు చెపుతున్నారని మండిపడుతున్నారు. అనాదిగా శ్రీరామునికి వశిష్ట గోత్రం, సీతాదేవికి గౌతమస గోత్రం, నిజమైన ప్రవరలు చెప్పేవారని, కానీ పుష్కర పట్టాభిషేకం నుంచి అసత్య గోత్ర ప్రవరలతో సీతారాముల కల్యాణం జరిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల ఆదర్శ దంపతులైన సీతారాములకు అపచారం జరుగుతోందని, భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నాయి పలు ధార్మిక సంఘాలు.
ఎవరి వాదన వారిదే
భద్రాచలంలో ఉన్నది ముమ్మాటికీ శ్రీరాముడే అని వైదిక వర్గంలోని కొందరు చెబుతుండగా.. రామ నారాయణుడే అని చెప్పడానికి ఆధారాలున్నాయంటున్నారు కొందరు అర్చకులు. రామచంద్రమూర్తి పేరుకు బదులు రామ నారాయణుడని సంబోధించడం వెనుక కుట్రకోణం దాగుందని, భద్రాచలం ఆలయాన్ని పూర్తిగా వైష్ణవ సంప్రదాయంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని కొందరు అర్చకులు, ఆధ్యాత్మిక వేత్తలు, ధార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. భద్రుడు, రామదాసు రామయ్యను రామచంద్రుడిగానే కీర్తించారని, రామనారాయణుడిగా ఎప్పుడూ సంబోధించలేదంటున్నారు.
అయితే రామ నారాయణుడు అనేందుకు పలు ఆధారాలున్నాయంటున్నారు దేవాలయ అర్చకులు. చతుర్భుజుడిగా, శంఖచక్ర, ధనుర్బాణాలతో వెలిశాడని, ఇది సాక్షాత్తూ నారాయణుడి స్వరూపమని మరో వర్గం వాదిస్తోంది. 1964 ఆలయ జీర్ణోద్ధరణ సమయంలో ప్రభుత్వం, దేవస్థానం కలసి తయారు చేసిన పుస్తకంలోనూ, 60 ఏళ్లకు ఒకసారి జరిగే మహాపట్టాభిషేక సమయంలోనూ రామ నారాయణ పదం వాడినట్లు చెబుతున్నారు. వంశపారపర్యంగా వచ్చే వాటిపై కూడా అభాండాలు వేస్తున్నారని మండిపడుతున్నారు.
రామాలయం ఎదుట ప్రారంభమైన నిరాహార దీక్షలు
అయితే ఈ విషయమై భద్రాచలంలో మళ్లీ భక్తులు, పలు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భద్రాచలంలో కొలువై ఉన్న స్వామి శ్రీరాముడా? లేక శ్రీరామ నారాయణుడా? అనేది దేవస్థానం అధికారులు స్పష్టత ఇవ్వాలని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు బూసిరెడ్డి శంకర్‌రెడ్డి రెండ్రోజుల క్రితం దేవస్థానం ఈవో శివాజీని కలిసి వినతిపత్రం సమర్పించారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంపై లిఖిత పూర్వకంగా స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. ఇదే విషయంపై భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యాలయం ఎదుట సోమవారం భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భక్తులు ధర్నా చేశారు. కల్యాణంలో వరుడుగా శ్రీరాముని పేరు చెప్పాలని భక్తులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. భద్రాచలం అర్చకుల తీరును నిరసిస్తూ భద్రాచలం పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఆలయం ఎదుట నిరాహార దీక్షలకు సైతం పూనుకున్నారు. కల్యాణంలో జరుగుతున్న అపశృతులను దేవస్థానం అధికారులు జోక్యం చేసుకుని సరిదిద్దాలని కోరుతున్నారు.
ముమ్మాటికీ రామచంద్రుడే..
భద్రాచలం సీతారాముల కల్యాణంలో జరుగుతున్న అపశృతులను దేవస్థానం అధికారులు జోక్యం చేసుకొని సరిదిద్దాలి. ముఖ్యంగా శ్రీ సీతారాముల కల్యాణంలో శ్రీరామచంద్ర నామాన్ని రామ నారాయణుడి గా పిలుస్తున్నారు. దీనిని వెంటనే పునరుద్ధరించాలి. భద్రాచలంలో ఉన్నది ముమ్మాటికీ శ్రీరామచంద్రుడే. దీనిలో ఎలాంటి సందేహం లేదు. కానీ కొందరు దురుద్దేశంతోనే స్వామివారి పేరును మార్చి చదువుతున్నారు. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దేవాలయంలో జరిగిన ఆభరణాల చోరీ, దేశ విదేశాల్లో జరిపిన కల్యాణాల దోపిడీపై విచారణ జరపాలి. సీసీ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించిన వైదిక సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. – బూసిరెడ్డి శంకర్ రెడ్డి, భద్రాచల ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షుడు.