ఏపీ జీవోను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం

by Shyam |
ఏపీ జీవోను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం
X

దిశ, నల్లగొండ: దక్షిణ తెలంగాణ ప్రాంతం, ప్రధానంగా నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగేలా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ నుంచి అక్రమంగా జీవో 203తో మూడు టీఎంసీ నీటిని తీసుకెళ్లుందకు చేస్తున్న ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించి పంచాయతీ రాజ్, కరోనా నియంత్రణ చర్యలు, మిషన్ భగీరథ పనులు తదితర అంశాలపై సమీక్షించారు. సభ ప్రారంభం కాగానే నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నర్సింహయ్య మాట్లాడుతూ.. పోతిరె డ్డిపాడు నుంచి అక్రమంగా ఏపీ ప్రభుత్వం 3 టీఎంసీల నీటిని తరలించుకుపోయే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని మాట్లాడగా హజరైన సభ్యులు బల పరుస్తూ సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. వేసవిలో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా రక్షిత నీరు అందించేందుకు చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగలడం వల్ల తాగునీరు అందడం లేదని పలువురు సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సమావేశం 90 రోజుల్లో నిర్వహించాల్సి ఉందని, కరోనా నేపథ్యంలో ముఖ్యమైన కొన్ని శాఖలు సమీక్షా చేయనున్నట్లు తెలిపారు. సభ్యులు ప్రస్తావించిన అంశాలు సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ గ్రామ,మండల స్థాయిలో సమస్యలు సభ్యులు ద్వారా సమావేశంలో ప్రస్తావనకు వస్తాయన్నారు. మిషన్ భగీరథ పనుల్లో జిల్లా కొంత వెనుకబడి ఉన్నదని, ఇప్పటికే శాసన సభ్యులతో కలిసి అర్‌డబ్ల్యూఎస్ ఈఈ, డిఈ, ఏఈలతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. లాక్‌డౌన్, కాంట్రాక్టర్లు సమస్య వల్ల పనులు ముందుకు సాగలేదని పేర్కొన్నారు. వచ్చే రెండు వారాల్లో శాసన సభ్యులు తెలిపిన సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆసుపత్రిలో సిటి స్కాన్, పేదలకు ఉపయోగం చెందేలా చూస్తానని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed