నిజామాబాద్‌లో కలకలం

by Shyam |
నిజామాబాద్‌లో కలకలం
X

దిశ, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మళ్లీ కరోనా కష్టాలు మొదలయ్యాయి. లాక్ డౌన్ సడలింపుల తరువాత కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 20 కేసులు నమోదు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో టీఆర్ఎస్ పార్టీలో కలకలం మొదలైంది. దీంతో ప్రజా ప్రతినిధులంతా పర్యటనలు మానుకుని హైదరాబాద్ కే పరిమితమయ్యారు. మార్చి నెలాఖరు నుంచి ఉమ్మడి జిల్లాలో పెరుగుతూ వచ్చిన కేసులు మే మొదటి వారంలో తగ్గుముఖం పట్టాయి. 61గా ఉన్న కేసుల సంఖ్య జీరోకు చేరుకోవడంతో రెడ్‌జోన్‌లో ఉన్న ఉమ్మడి జిల్లా గ్రీన్‌జోన్‌లోకి మారింది. దీంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి 15 రోజులుగా కొత్తగా కరోనా కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళనకు గురి చేస్తోంది. నిజామాబాద్ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు పాజిటివ్‌ అని తేలడంతో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, నాయకులు, సిబ్బంది హోం క్వారంటైన్‌లో ఉండిపోయారు. ఎమ్మెల్యేతోపాటు మోర్తాడ్‌ మండలానికి చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడికీ కోవిడ్ సోకింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్వీయరక్షణ చర్యలు పాటించాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచిస్తున్నా ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. గుంపులు, గుంపులుగా తిరుగుతున్నారు. ఇదే కేసుల నమోదుకు కారణంగా తెలుస్తోంది.

సడలింపుల తరువాత…

సడలింపుల తరువాత పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారితో పాజిటివ్‌ కేసులు వెలుగు చూడడం కలకలం రేపుతున్నది. మోర్తాడ్‌లో ఒక కేసు నమోదు కావడంతో పోలీసులు వ్యాపార సంస్థలను మూసివేయించేశారు. కామారెడ్డిలో ఏడు కేసులు వచ్చాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారితో మరో రెండు కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం బాజిరెడ్డి గోవర్ధన్‌ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని హైదరాబాద్‌లో కలిసి కొద్దిసేపు మాట్లాడారు. ఆదివారం డిచ్‌పల్లి మండలం బీబీపూర్‌ తండాలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభించారు. తిరిగి వచ్చిన తరువాత ఆయనకు కరోనా అని తేలింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను కలిసిన వారిని గుర్తించి వారందరిని హోం క్వారంటైన్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైన వారి రక్తనమూనాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. తన అనుచరుడికి కూడా కరోనా సోకడంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యక్రమాలను రద్దు చేసుకోని హైదరాబాద్ కు బయలు దేరారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఎమ్మెల్యే గణేశ్ గుప్తాకు కూడా..

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాకు సోమవారం కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన చివరగా 13న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను కలిసినట్లు సమాచారం. దీతో గణేశ్ గుప్తా కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌కు తరలించారు.

Advertisement

Next Story