ఎడతెగని ఉత్కంఠ.. ఏమైతదో తెలవట్లే

by  |
ఎడతెగని ఉత్కంఠ.. ఏమైతదో తెలవట్లే
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా మహమ్మారితో ఈ విద్యాసంవత్సరం ఆగమ్యగోచరంగా మారింది. వేగంగా విజృంభిస్తున్న కరోనాతో బడులు తెరవడం ఇప్పట్లో కష్టమే..? ఈసారి పాఠశాలలు కొనసాగుతాయా..? లేదా అనే విషయంలో స్పష్టత కరువైంది. దీనికి తోడు 2020, ఆగస్టు 31 వరకు స్కూళ్లను నడుపొద్దని, కేంద్రం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరంపై నీలి నీడలు కమ్మకుంటున్నాయి. మేడ్చల్ జిల్లావ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో అయోమాయం నెలకొంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో మొత్తం 505 ప్రభుత్వ/స్థానిక సంస్థల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 375 ప్రభుత్వ ప్రాథమిక ,22 ప్రాథమికోన్నత, 108 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గతేడాది ఈ పాఠశాలలన్నింటీలో కలిపి 82 వేల 570 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీటితోపాటు వందలాది ప్రైవేటు పాఠశాలుండగా, వీటిల్లో లక్షలాది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం రద్ధయితే వీరి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

విద్యాసంత్సరంపై అనుమానమే..?

సాధారణంగా విద్యాసంవత్సరంలో ఏడాదికి కనీసం 200 పనిదినాలు తప్పనిసరి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో (సెప్టెంబర్ తర్వాత) తరగతులు ఆలస్యంగా ప్రారంభమైతే సకాలంలో సెలబస్ పూర్తికాదు. పరీక్షల నిర్వహణ సమయం చాలదు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం.. చర్చల దశలో ఉండటం వల్ల, అకడమిక్ ఇయర్‌పై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థుల కోసం పలు పథకాలు, రాయితీలు, మధ్యాహ్న భోజన పథకం తదితర పథకాలను అమలు చేస్తున్నాయి. తరగతులు పున: ప్రారంభించకపోతే ఈ పథకాలన్నీ నిలిచిపోనున్నాయి.

ప్రవేశాలపై సందిగ్ధత..

ఉన్నత విద్యా ప్రవేశాలపై సంబంధించి రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు రద్దయ్యాయి. తద్వారా ఉన్నత విద్య సంస్థల్లో ఈ ఏడాది ప్రవేశాలు లేనట్లేన్నన్స సంకేతాలు వెలువడ్డాయి. పోనీ పాత తరగతుల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లను భర్తీ చేస్తే విమర్శలు చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం.. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్‌గా చూపించింది. కానీ, గ్రేడింగ్ ఎలా ఇవ్వాలనే దానిపై విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. కరోనా నియంత్రణ అయితే కానీ విద్యాసంస్థలు ప్రారంభించే పరిస్థితి కానరావడంలేదు. ఒకవేళ విద్యాసంవత్సరం రద్దయినా.. చదువులకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏం చేయాలన్న దానిపై విద్యాశాఖ సమాలోచనలు చేస్తుంది. డిజిటల్ క్లాసులు నిర్వహణ కోసం జిల్లాలో ఇంటింటా సర్వే చేస్తూ తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది. ఆగస్టు 15 వరకు సర్కారు బడుల్లో ఆన్ లైన్ బోధనపై స్పష్టత రావొచ్చని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.



Next Story