పోరాటం కోసం బిడ్డను వదిలిన తల్లి మృతి

by  |
పోరాటం కోసం బిడ్డను వదిలిన తల్లి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం విప్లవ పోరాట యోధురాలు, సీపీఐ, న్యూ డెమోక్రసి నాయకురాలు పైలా చంద్రమ్మ కన్నుమూశారు. 72 ఏళ్ళ చంద్రమ్మ కరోనా బారిన పడి విశాఖ కేజీహెచ్ లో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.

16వ ఏటనే చంద్రమ్మ శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. చంద్రమ్మ భర్త పైలా వాసుదేవరావు కూడా శ్రీకాకుళ సాయుధ పోరాటానికి కృషి చేశారు. చంద్రమ్మ తన జీవితము మొత్తాన్ని విప్లవ పార్టీలకే వెచ్చించారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు తనకు పుట్టిన బిడ్డను కూడా పార్టీ నిర్ణయం మేరకు ఇతరులకు అందించారు. విప్లవోద్యమంలో పని చేసినందుకుగానూ జైలు శిక్షను అనుభవించారు. జైలులోనే ఆమె తన బిడ్డకి జన్మనిచ్చారు.

ప్రస్తుతం ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలుగా ఉన్న ఆమె 1982 నుండి ప్రజాసంఘాల్లో పని చేస్తున్నారు. 53 సంవత్సరాల పాటు విప్లవోద్యమంలో పని చేసిన చంద్రమ్మ శ్రీకాకుళం జిల్లా న్యూ డెమోక్రసీ పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఈ నెల 12 న కుమారన్న సంస్మరణ సభలో పాల్గొన్న చంద్రమ్మ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరోనా నిర్ధారణ కావడంతో ఆమెను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. అక్కడే చికిత్స తీసుకుంటూ మరణించారు.


Next Story

Most Viewed