బాలాపూర్ పీహెచ్‌సీలో అక్రమాలు

by Anukaran |
బాలాపూర్ పీహెచ్‌సీలో అక్రమాలు
X

దిశ ప్రతినిధి,రంగారెడ్డి: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని బాలాపూర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్య సిబ్బందిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి ఆస్పత్రిలోనే తిష్ఠవేసి కూర్చున్న కొంత మంది ఉద్యోగులు తమ యూనియన్లను అడ్డుపెట్టుకొని అధికారులను సైతం ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. కొవిడ్‌ కిట్లు, టీకాలను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపై లెనిన్‌నగర్, బాలనగర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, పహడీషరీఫ్‌లకు చెందిన కొంత మంది ఏకంగా డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్ ఫిర్యాదు చేయడం గమనార్హం. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వైద్య సిబ్బందిపై వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో డీహెచ్‌ విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.

క్షేత్రస్థాయి సిబ్బందిపై ఆరోపణలు ఇవే…

–బాలాపూర్‌ పీహెచ్‌సీలో గత పదేళ్ల నుంచి ఒకే ఉద్యోగి సూపర్‌‌‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మాజీ నక్సలైట్‌‌గా చెప్పుకుంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఈయన తనకు ఉన్న రాజకీయ అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ సూపర్‌వైజర్‌ స్థాయి ఉద్యోగి మెడికల్‌ ఆఫీసర్‌‌కు డ్యూటీలు వేస్తున్నారంటే ఆశ్చర్యపోనసరం లేదు.

–మొయినాబాద్‌ నుంచి డిప్యూటేషన్‌పై ఇక్కడికి వచ్చిన ఓ సీహెచ్‌ఓ తనకున్న అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు. రూ.వంద ఇస్తే చాలు ఒరిజినల్స్‌ చూడకుండానే గెజిటెడ్‌ సంతకాలు పెట్టేస్తున్నారు. అంతేకాదు ఆయన పెట్టిన సంతకాలపై ఆస్పత్రి మెడికల్‌ ఆఫీసర్‌కు సంబంధించిన స్టాంపు వేస్తున్నారు. ఈ అంశాన్ని గుర్తించి నిలదీసిన ఓ వైద్యురాలితో ఆయన దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

–క్షేత్రస్థాయిలో పని చేస్తున్న కొంత మంది టెక్నిషియన్లు, ఏఎన్‌ఎంలు తరచూ విధులకు గైర్హజరవడంతో పాటు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.

– ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే కొవిడ్‌ కిట్లు సహా టీకాలను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టెస్టుల కోసం వచ్చే వారి నుంచి డబ్బులు తీసుకుని సీరియల్‌ నెంబర్‌ మార్చడంతో పాటు ఎంపిక చేసిన లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు టీకాలను వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

–వీరిలో కొంత మంది ఏఎన్‌ఎంలు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన పోలియో, డీపీటీ వ్యాక్సిన్లను ప్రైవేటుకు అమ్ముతుండటంతో పాటు లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed