- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈపీఎఫ్ అమలుకు కంపెనీలు దూరం!
ముంబయి: కరోనా సంక్షోభం కారణంగా దేశం రెండు నెలలకు పైగా లాక్‌డౌన్‌లో ఉంది. స్తంభించిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఆర్థిక మంత్రి వివరించిన భారీ ఉద్దీపన ప్యాకేజీలో పెద్దగా ఇచ్చిందేమీ లేదని విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి పెద్దగా ప్రయోజనాలు ఉండవని ఖరారు చేసుకున్న వారు అవసరమైన వెసులుబాట్లను వెతుక్కుంటున్నారు. ప్రభుత్వం ఇచిన వాటిలో ప్రధానమైంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్). అయితే, కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల భవిష్య నిధి విధివిధానాలు సైతం ప్రయోజనకరంగా లేకపోవడం గమనించాల్సిన అంశం. లాక్‌డౌన్ కాలంలోనూ ఆ తర్వాతి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరి చేతిలో నగదు సౌకర్యం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈపీఎఫ్‌పై ప్రకటన చేసింది. ఉద్యోగులు అవసరమనుకుంటే వారి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను 10శాతం తగ్గించుకునే అవకాశమిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంతేకాకుండా సంస్థ చెల్లించే దాంట్లో 10 శాతానికి పరిమితం చేసుకోవచ్చని, తద్వారా వచ్చేదాన్ని ఉద్యోగికి బదిలీ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడున్న ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం ఉద్యోగి కనీస వేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్‌కు జమ చేస్తున్నారు. సంస్థ కూడా 12శాతం మొత్తాన్ని జమ చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ద్వారా ప్రతి ఉద్యోగి 4శాతం వరకు అదనపు వేతనం అందుకోవాలి(ఉద్యోగికి చెందిన 2 శాతం, సంస్థ నుంచి 2 శాతం మిగులు). కానీ, వాస్తవంలో పరిస్థితి వేరేగా ఉంది.
పాత విధానమే బెటర్
దేశవ్యాప్తంగా 6కోట్ల మంది యాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వ ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది. ప్రతి ఉద్యోగి జేబులోనూ అదనపు సొమ్ము అందుబాటులో ఉంటుందని, దీనిద్వారా లాక్‌డౌన్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు వినియోగించవచ్చని ఆర్థిక మంత్రి వివరించారు. వాస్తవంలో ఈపీఎఫ్ సడలింపు 4శాతం మొత్తం పన్ను పరిధిలోకి వెళ్తోంది. దీనివల్ల ఉద్యోగి పన్ను రేట్ల ప్రకారం కనిష్ఠంగా 2శాతం, గరిష్ఠంగా 3శాతం చెల్లింపులకే వెళ్తోంది. మిగిలింది 1శాతం మాత్రమే. దీన్నిబట్టి ప్రభుత్వం ఒకవైపు ఇస్తూనే, మరోవైపు పన్ను రూపంలో లాగేస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చాలా సంస్థలు తమ ఉద్యోగులను పాత విధానాన్నే ఎంచుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని సంస్థలు పాత విధానాన్నే అమలు పరుస్తున్నాయి కూడా. లాక్‌డౌన్ మొదట్లోను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈపీఎఫ్ గురించి ఇలాంటి ప్రకటనే ఒకటి చేశారు. చిన్న సంస్థలకు ప్రయోజనాలను అందించేలా ఉద్యోగి ఈపీఎఫ్ నుంచి 12శాతం, సంస్థ చెల్లించాల్సి 12శాతం మొత్తం 24 శాతం ప్రభుత్వమే చెల్లిస్తుందనే హామీ ఇచ్చింది. దీనికి మెలిక కూడా పెట్టింది. ఈ ప్రయోజనాలు కోరుకొనే సంస్థల ఉద్యోగుల సంఖ్య 100 లోపు ఉండాలని, అందులోనూ 90శాతం ఉద్యోగుల జీతం రూ.15వేలు కంటే తక్కువ ఉండాలని, ఈ ప్రయోజనం అప్పుడే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆతర్వాత ఈ ప్రయోజనాలను ఎన్ని కంపెనీలు ఉపయోగించుకున్నాయో స్పష్టత లేదు. కొన్ని సంస్థలకు ఇది అర్థం కాని అంశంగా మిగిలిపోయింది.
ఆలస్యమైతే నో పెనాల్టీ
ఇటీవల నగదు లభ్యత సమస్యలను ఎదుర్కొనే సంస్థలకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) మరో వెసులుబాటు ఇచ్చింది. పీఎఫ్ కోసం సంస్థలు చెల్లించే వాటా ఆలస్యమైనా పెనాల్టీ ఉండదని నిర్ణయించింది. పారిశ్రామిక సంఘం నిర్వహించిన వెబ్‌నార్‌లో ఈపీఎఫ్‌వో కమిషనర్ సునీర్ బర్త్వాల్ ఈ విషయం వెల్లడించారు. ఈపీఎఫ్ పథకం 1952 కింద పీఎఫ్ వాటాను డిపాజిట్ చేయకపోతే ఆయా సంస్థలకు పెనాల్టీ విధించే అధికారం ఈపీఎఫ్‌వోకు ఉంటుంది. ఒక నెలకు చెందిన వేతనంపై తర్వాతి నెల 15వ తేదీలోపు పీఎఫ్ వాటా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇదివరకు 10రోజుల అదనపు సమయాన్ని ఈపీఎఫ్‌వో ఇచ్చింది. లాక్‌డౌన్ పరిణామాలతో 10రోజుల అదనపు గడువు లోపు కూడా చెల్లించడానికి సంస్థలు ఇబ్బంది పడ్డాయి. ఇలాంటి సంస్థలు చెల్లించని పక్షంలో ఎలాంటి పెనాల్టీ విధించకూడదని క్షేత్రస్థాయి అధికారులకు మే 15న సర్క్యూలర్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో 6లక్షల సంస్థలకు ఊరట లభిస్తుంది. ఇక, కేంద్రం ఇచ్చిన పీఎఫ్ వాటా తగ్గింపు ఈ నెల నుంచి అమలుకానుంది. ఉద్యోగి, సంస్థల పీఎఫ్ వాటా 12శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం మే నెలకు సంబంధించిన వేతనాల్లో అమలవుతుందని సునీల్ బర్త్వాల్ స్పష్టం చేశారు. ఉద్యోగులు ఇదివరకటి కంటే అధిక వేతనాన్ని ఇంటికి తీసుకెళ్తారని, సంస్థలు పీఎఫ్ బకాయి చెల్లింపు ఊరటతో రూ.6,750కోట్ల వరకు ద్రవ్య లభ్యత ఉంటుందని ఆయన వివరించారు.