సామాన్యుల ఆశలకు ‘లాక్’ !

by Shyam |   ( Updated:2020-04-16 09:13:28.0  )
సామాన్యుల ఆశలకు ‘లాక్’ !
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి సామాన్యుల బతుకులను అతలాకుతలం చేస్తోంది. వైరస్ నివారణకు మెడిసిన్ లేనందున.. చేసే ఉద్యోగాలకు దూరమై ఇండ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. గత మార్చిలో లాక్‌డౌన్ పీరియడ్ కేవలం వారం రోజులే కావడంతో.. సానుకూలంగా స్పందించిన ఆయా కంపెనీలు నెల వేతనాన్ని అందజేశాయి. ఏప్రిల్ నెల మొత్తం లాక్‌డౌన్ కొనసాగనున్నందున, ఈ నెల వేతనాలు అందుతాయా.. అనే సందేహం ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది. ప్రభుత్వం చెప్పినట్టుగా ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వివిధ ప్రయివేటు సంస్థలు వేతనాలు చెల్లిస్తాయా ? ఏప్రిల్ నెలంతా విధుల్లో లేనందున సదరు సంస్థలు వేతనాలు ఇవ్వకపోతే.. మే నెలంతా గడిచేదెట్టా ? కుటుంబాన్నినడిపించేదెట్టా ? అనే సందేహాలతో సామాన్యులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తున్న కారణంగా రాత్రిపూట కంటి మీద కునుకు లేక నానా అవస్థలు పడుతున్నారు.

నెల రోజులుగా ఇండ్లకే పరిమితం..

నగరంలోని ముషీరాబాద్‌కు చెందిన ఓ మధ్య తరగతి వ్యక్తి.. ప్రయివేటు సంస్థలో ఉద్యోగి. నెలకు రూ.20 వేల జీతం. నాలుగిళ్లల్లో పని చేస్తే ఆయన భార్యకు వచ్చే రూ.8 వేలు కలిపితే మొత్తం కుటుంబ సంపాదన రూ.28 వేలు. ఈ సంపాదనలో ఇంటి అద్దె, విద్యుత్ బిల్లు, కేబుల్ బిల్లు, ఫోన్ రీచార్జి, పాలు, బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, గ్యాస్ బిల్లు, పిల్లల స్కూల్ ఫీజులు, పెట్రోల్ ఖర్చులు, వైద్యం, ప్రతినెలా పాత అప్పులకు చెల్లించే వడ్డీలు, స్వయం సహాయక పొదుపు గ్రూపు తదితర ఖర్చులన్నీ కలిపి రూ.28 నుంచి రూ.30 వేల వరకు అవుతున్నాయి. అంటే ప్రతీ నెల ఆదాయానికి మించి ఖర్చవుతోంది. ఈ అదనపు ఖర్చును కిరాణం, మిత్రులు వద్ద తీసుకునే చేబదులు రూపంలో ఏ నెలకు ఆ నెల రొటేషన్ చేయాల్సి వస్తోందంటూ సదరు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎదురైన లాక్‌డౌన్.. మధ్యతరగతి జీవితాలను మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. సంపాదించే నాలుగు చేతులు నెల రోజులుగా ఖాళీగా ఉంటున్నాయి. దీంతో సామాన్యుని జీవితం ఒక్కసారిగా కుదేలైపోయింది.

పదే పదే దిగులుతో..

భవిష్యత్తులో అప్పులు పేరుకుపోకుండా ఉండేందుకు ఏప్రిల్ మొదటి వారంలో వచ్చిన మార్చి నెల వేతనాన్ని ఎప్పటిలాగే చెల్లింపులు చేసి, మిగిలిన దాంతోనే కుటుంబాన్ని నెట్టుకురావాల్సిన దుస్థితిలో సామాన్యులు, పేదలున్నారు. ఈ నేపథ్యంలో ‘సీఎం కేసీఆర్ బ్యాంకులో జమ చేస్తానన్న రూ.1500 కోసం తరుచూ ఫోన్ మెస్సేజ్ చూసుకుంటున్నాం, పిల్లలకేదైనా చేసి పెడదామంటే.. ఖర్చులు గుర్తొచ్చి గుండె గాబరా అవుతోంది’ అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ వేతనం రాకుంటే ఇల్లు గడిచేదెట్టా.. కుటుంబాన్ని నడిపేదెట్టా.. అంటూ సామాన్యులు దిగులు చెందుతున్నారు. ఇంటి అద్దె, అప్పులంటే ఆగుతారు. కానీ, ప్రతీ నెల ఇంటికి కావాల్సిన నిత్యావసరాల కొనుగోలుకు డబ్బులెట్లా ? అన్న ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఆశలన్నీ తుడుచుకుపోయాయా..

లాక్‌డౌన్.. పేద, ధనిక అనే తేడాల్లేకుండా ప్రజలందరికీ అనేకానుభవాలను నేర్పుతోంది. కాగా.. ఆర్థిక, సామాజిక రంగాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తేసినా కూడా ‘మా ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో’ అంటూ చాలా మంది లోలోన మదనపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలు ఉన్నత చదువులకు దూరం కావాల్సిందేనా.. ఇప్పటి వరకు భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలన్నీ తుంచుకోవాల్సిందేనా అన్న ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కుంటున్నారు. ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో ఒక నెల వేతనం రాకుంటేనే.. ఆ పరిస్థితులను సర్ధుబాటు చేయాలంటే సరాసరి 6 నెలలు పడుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఓ వైపు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలై.. వర్తమానమే కష్టమవుతున్న ఈ తరుణంలో ఇక భవిష్యత్తు ప్రశ్నార్థకమే అంటున్నారు పేదలు, సామాన్యులు. కరోనా సృష్టించిన ఈ విపత్కర పరిస్థితులు ఎన్నటికి చక్కబడేనో !

Tags: corona effect, middle class family, pvt employees, poor people,lockdown

Advertisement

Next Story

Most Viewed