నేను అమ్ముడుపోయాను.. అభివృద్ధి ఆగిందంటూ చెప్పు దెబ్బలు

by Shyam |   ( Updated:2021-11-29 11:27:25.0  )
నేను అమ్ముడుపోయాను.. అభివృద్ధి ఆగిందంటూ చెప్పు దెబ్బలు
X

దిశ, తాండూరు: ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ఓటు అనే ఆయుధాన్ని బీరు-బిర్యానీ, డబ్బులకు అమ్ముకున్నారని మనోవేదనతో పశ్చాత్తాప పడుతూ సోమవారం ఓ వ్యక్తి చెప్పుల దండ మెడ‌లో వేసుకుని, గుడ్లతో కొట్టించుకుని నిర‌స‌న వ్యక్తం చేశారు. ఈ వినూత్న ఘటన తాండూరు మండలం అంతారం గేట్ వద్ద అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తనను చెప్పుతో కొట్టి.. దిష్టి బొమ్మల‌ను ద‌హ‌నం చేయాల‌ని నిరసనకారుడు విజ్ఞప్తి చేశాడు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చలేద‌ని ఓ కామ‌న్ మ్యాన్‌ ప్రభుత్వ తీరును నిర‌సిస్తూ ఇలా వినూత్నంగా నిర‌స‌న వ్యక్తం చేయడం గమనార్హం.

ఇంతకీ ఇతనెవరు.. డిమాండ్లు ఏంటివి..?

తాండూరు మండ‌లం అంతారం గ్రామానికి చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి ఈ నిర‌స‌న చేప‌ట్టాడు. గ‌త ఎన్నిక‌ల్లో తాండూరును అభివృద్ధి చేస్తామని.. రోడ్ల దుస్థితిని మారుస్తామని.. కాలుష్యాన్ని నివారిస్తామని అధికార పార్టీ హామీ ఇవ్వడంతో న‌మ్మి ఎన్నిక‌ల్లో ఓటేశాన‌ని చెప్పుకొచ్చాడు. కానీ, ఎన్నిక‌ల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలు విస్మరించార‌ని ఆరోపించాడు. ప్రస్తుతం అధ్వాన్నంగా మారిన దుస్థితికి నేనే కార‌ణ‌మ‌ని.. దుమ్ము, కాలుష్యానికి.. ప్రజ‌ల ఇబ్బందుల‌కు ఓ ఓట‌రుగా నేనే కార‌ణ‌మంటూ ఆందోళన చేపట్టాడు. ఇది చూసిన జ‌నాలు ఆశ్చర్యానికి గుర‌య్యారు. ప్రజా ప్రతినిధులు చేయ‌ని ప‌నిని ఓ ఓట‌రు రిజ్వాన్ చేసిన ప‌నిని అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed