కష్టాల్లో కమెడియన్ రామచంద్రయ్య

by Anukaran |
కష్టాల్లో కమెడియన్ రామచంద్రయ్య
X

‌‌దిశ ప్రతినిధి, రంగారెడ్డి, మహేశ్వరం: అంగవైకల్యం ఉన్నా ఆయన ఆత్మస్థైర్యం కోల్పోలేదు. మరుగుజ్జునని ఏనాడూ మథనపడలేదు. శారీరక లోపాన్ని అవకాశంగా మార్చుకున్నాడు కమెడియన్​ రామచంద్రయ్య. ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో రాణిస్తున్నాడు. తన ప్రతిభతో పలు ప్రైవేట్ ఆల్బమ్స్​ రూపొందించాడు. ఫంక్షన్లతో పాటు వండర్ లా ఎంట్రీ వద్ద వినూత్నమైన పద్ధతిలో స్వాగతం పలికే వాడు. వైరస్​ మహమ్మారి రామచంద్రయ్యను కష్టాల కడలికి చేర్చింది. విపత్కర సమయంలో పనులు దొరక్క పోవడంతో రామచంద్రయ్య ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మ లూరు గ్రామానికి చెందిన ఎల్గమోని రామ చంద్ర య్య అంగవైకల్యంతో జన్మించాడు. మరుగుజ్జుగా ఉండడంతో చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలకు గురయ్యడు. వయస్సు మీదపడుతుండడంతో ఎదో ఒక పనిచేసి జీవనం సాగించాలని భావించా డు. సినిమాల్లో కామెడియన్​అవకాశాల కోసం ప్రయత్నించాడు. శివాజీ, సండే, ప్రియ నేస్తం సినిమాల్లో పాత్రను పోషించాడు. ‘పిల్లో పద్మజా’ అనే జానపదం ఆల్బమ్ చేశాడు. మూడేళ్ల క్రితం జీ తెలుగులో మాయ ద్వీపం ప్రోగ్రాంలో పోతు రాజు పాత్ర చేశాడు. కానీ క్రమేనా అవకాశాలు తగ్గడంతో మహేశ్వరం మండలంలోని రావిర్యాలలోని వండర్​లా ఎగ్జిబిషన్​లో స్వాగత ద్వారం వద్ద పర్యాటకులకు ఆహ్వానం పలికేవాడు. కరోనాతో వండర్​ లా బంద్ కావడంతో రామచంద్రయ్య ఇంటికే పరిమితమయ్యాడు.

నేపథ్యం..

రామచంద్రయ్య భార్య పేరు లక్ష్మీ. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కుతూరు శ్రావ్య ఇంటర్ సెంకడియర్, కుమారుడు కార్తీక్ 10వ తరగతి, చిన్న కూతురు కావ్య 9వ తరగతి చదువుతున్నారు. భార్య లక్ష్మీ ఓ కంపెనీలో హౌస్ కీపర్ గా పని చేస్తోంది. కరోనా కారణంతో ఆ కంపెనీ తాత్కలికంగా బంద్ కావడంతో భార్యాభర్తలు ఇద్దరు ఇంటికే పరిమితమయ్యారు.

ఉద్యోగం కోసం ప్రయత్నాలు..

రామచంద్రయ్య హైదరాబాద్​లోని సిటీ కాలేజీలో ఇంటర్ చదువుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించాలని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని వేడుకోగా రూ.50వేల ఆర్థిక సాయం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైన తీగల కృష్ణారెడ్డిని, సీఎం కేసీఆర్​ను సైతం అటెండర్ గానైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని పలుమార్లు వేడుకున్నాడు. కానీ ఇప్పటికి ఆ హామీలు నెరవేరలేదు. ప్రస్తుతం వికలాంగుల పింఛన్​ప్రతీనెల రూ.3వేలతోనే కుటుంబాన్ని లాక్కొస్తున్నానని రామచంద్రయ్య తెలిపారు.

ఎప్పుడూ బాధపడలేదు: రామచంద్రయ్య

పొట్టిగా ఉన్నానని ఎప్పుడూ బాధపడలేదు. ఆత్మ స్థైర్యం కోల్పోకుండా జీవన పోరాటం చేశాను. కాలేజీ సమయాల్లో నన్ను అనేక మంది హేళన చేశారు. కొంత మంది స్నేహితులు నాకు పూర్తి మద్దతుగా ఉండేవారు. సినిమాల్లో సెకండ్ల పాటు పాత్ర ఇస్తే కడుపు నింపేది కాదు. అందుకే ప్రైవేట్ ఫంక్షన్లలో స్వాగత ద్వారం వద్ద కమెడియన్​గా పనిచేసేవాడిని. కరోనాతో వండర్​లా బంద్ చేశారు. ఆరు నెలలుగా ఇంటికే పరిమితమయ్యా. కుటుంబం గడవడం కష్టంగా ఉంది.

Advertisement

Next Story