వేములవాడలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ : కలెక్టర్ కృష్ణభాస్కర్

by Sridhar Babu |

దిశ, కరీంనగర్: విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉద్యోగులను సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సస్పెండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్‌కు చార్జ్ మోమో జారీ చేశారు. ఇందుకు కంటైన్‌మెంట్ జో‌న్‌లోకి ఇతరులు ప్రవేశించి, ఆ ప్రాంత వాసులకు ఆహారం పంపిణీ చేయడమే కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే వేములవాడ పట్టణానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో వారి నివాస ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. మంగళవారం టీఆర్‌కే ట్రస్టు ప్రతినిధులు ఆ ఏరియాకు వెళ్లి కోడిగుడ్లు, ఇతరత్ర సామగ్రిని పంపిణీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతరులు కంటైన్‌మెంట్ జోన్‌లోకి ప్రవేశించడానికి జూనియర్ అసిస్టెంట్ రాదారపు శ్రీనివాస్, టెక్నికల్ అధికారి శ్రవణ్‌కుమార్‌లను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. ఆ కాలనీలోకి ఇతరులు వెళ్లడానికి వీరి నిర్లక్ష్యమే కారణమని వివరిస్తూ సస్పెన్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులను కలెక్టర్ జారీచేశారు. ఇందులో వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి నిర్లక్ష్యం కూడా ఉందని గుర్తించిన కృష్ణ భాస్కర్ ఆయనకు చార్జ్ మెమో జారీ చేసి, 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది.

Tags: containment area, officer suspend, sircilla collector krishna bhasker, charge memo

Advertisement

Next Story

Most Viewed