కృష్ణా జిల్లా మూడు జోన్లు..విజయవాడ 19 క్లస్టర్లు

by srinivas |
కృష్ణా జిల్లా మూడు జోన్లు..విజయవాడ 19 క్లస్టర్లు
X

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కృష్ణా జిల్లాను రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్‌లుగా విభజిస్తూ కలెర్టక్ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరంజ్ జోన్‌లో గన్నవరం, ముసునూరు, కంకిపాడు, జగ్గయ్యపేట రూరల్ మండలాలు ఉండగా, రెడ్‌జోన్‌లో పెనమలూరు, విజయవాడ సిటీ, రూరల్ మండలాలు..మచిలీపట్నం కార్పొరేషన్, జగ్గయ్యపేట, నూజివీడు, గుడివాడ, పెడన..కొండపల్లి మున్సిపాలిటీలు, తిరువూరు, ఉయ్యూరు, నందిగామ నగర పంచాయతీలు ఉన్నాయి. అలాగే మిగిలిన 43 మండలాలు గ్రీన్‌జోన్లుగా కలెక్టర్ ప్రకటించారు

విజయవాడ నగరంలో 19 క్లస్టర్లకుగానూ, కృష్ణలంక, కార్మికనగర్‌, అజిత్‌సింగ్‌నగర్‌ మూడు క్లస్టర్లలోనే 120 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కలెక్టర్‌ ఇంతియాజ్‌ వివరించారు. క్లస్టర్‌ జోన్లలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ కేసులను గుర్తించి మరుసటి రోజే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. బాధితుడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధించిన వారందరినీ క్వారంటైన్‌ను తరలిస్తున్నామన్నారు.

కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 11వేల పరీక్షలు నిర్వహించామని, మరో 8వేల శాంపిల్స్‌ సేకరించామన్నారు. రేపటికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారందరికీ పరీక్షలు పూర్తిచేస్తామన్నారు. ట్రూనాట్‌, రాపిడ్‌ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గత నెల 29 నుంచి నాల్గో విడత సర్వేలైన్స్‌ సర్వే చేపట్టామన్నారు. కృష్ణలంక, కార్మికనగర్‌ ప్రాంతాల్లోని వీధుల్లో పెద్దఎత్తున బారికేడింగ్‌ ఏర్పాటుచేసి ప్రజల రాకపోకలను కట్టడి చేశామన్నారు.

ఆరోగ్య సేతు యాప్‌పై డ్వామా, డీఆర్డీఏ, మెప్మా పీడీల ద్వారా ఆయా గ్రూపు సభ్యులకు అవగాహన కల్పించామన్నారు. జిల్లాలోని ఉద్యోగులందరూ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,30,203 మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. మీ ఫోన్‌లో బ్లూటూత్‌ లొకేషన్‌, మొబైల్‌ నెంబర్‌ ఆధారంగా మీ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎక్కడైనా కరోనా వచ్చిందా, సురక్షితంగా ఉన్నారా, లేదా అనే సమాచారం ఈ యాప్‌ ద్వారా తెలుస్తుందన్నారు.

కరోనా బారిన పడుతున్న ఉద్యోగులు, ఇతరులకు మరో కొవిడ్‌ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని ఆయన సీఎస్‌ను కోరారు. కృష్ణా జిల్లాకు మరో 70 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 40 మంది స్టాఫ్‌ నర్సులు అదనంగా కావాలని సూచించారు. టెలి మెడిసిన్‌ 14410 ద్వారా జిల్లాలో 55 మంది మందులు పొందగా, 861 మంది వైద్య సహాయం పొందినట్టు ఆయన తెలిపారు. మొబైల్‌ రైతుబజార్లు, విజయ కృష్ణా సూపర్‌బజార్‌ ద్వారా నిత్యావసర సరుకులు, కూరగాయలు డోర్‌ డెలివరీకి చర్యలు చేపట్టామన్నారు. పీడీఎస్‌ ద్వారా మూడో విడత రేషన్‌ పంపిణీ ప్రారంభించామని చెప్పారు.

tags: krishna district, ap, corona positive cases, collector, imtiaz

Advertisement

Next Story