పూరిగుట్ట ప్రజలెవరూ బయటకు రావొద్దు: కలెక్టర్ హనుమంతు

by Shyam |

దిశ, వరంగల్: వరంగల్ నగరంలోని పూరిగుట్టను కంటైన్మెంట్ ప్రాంతంగా గుర్తించినందున ప్రజలెవరూ బయటకు రావొద్దని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. బుధవారం పోలీస్ కమిషనర్ రవీందర్, వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి ఆ ప్రాంతంలో కరోనా పరిస్థితిపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కేసులు నమోదైన చోటు నుంచి కిలోమీటర్ దూరంలో వైరస్ విస్తరించకుండా ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఇంటింటి సర్వే చేసి, అనుమానితులను గుర్తించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. బయటి వ్యక్తులు కంటైన్మెంట్ జోన్‌లోకి ప్రవేశించకుండా పోలీసుల సూచన మేరకు కంచె ఏర్పాటు చేయాలని ఆర్‌ అండ్ బీ అధికారులకు సూచించారు. అక్కడి ప్రజలకు నిత్యాసరాలు అందించేందుకు మొబైల్ కూరగాయల మార్కెట్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. అలాగే ఈ ప్రాంతంలో పరిసరాల పరిశుభ్రతకు సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 19 మంది కరోనా అనుమానితులను గుర్తించి ప్రభుత్వ క్వారెంటైన్‌కు తరలించామన్నారు.

Tags: corona, lockdown, poorigutta, containment area, collector hanumanthu

Advertisement

Next Story

Most Viewed