టీఆర్‌ఎస్‌లో గ్రూపు తగాదాలు.. ఎవరెవరికి అంటే..?

by Shyam |   ( Updated:2020-06-18 22:31:16.0  )
టీఆర్‌ఎస్‌లో గ్రూపు తగాదాలు.. ఎవరెవరికి అంటే..?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: టీఆర్ఎస్ పార్టీలో గ్రూపు తగాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, దిగువ శ్రేణి నాయకులందరూ టీఆర్​ఎస్​లోనే ఉండడంతో సీనియర్​, జూనియర్​ నాయకులంటూ విభేదాలు మొదలయ్యాయి. ఇటీవల కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్​, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిల వర్గ పోరు రోడ్డుకెక్కింది. వీరి గ్రూప్ రాజకీయాలు ఏకంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద మద్దతుదారులు ధర్నాలు చేసే వరకు వెళ్లింది. వీరిద్దరి మధ్య వార్​ ఇన్ని రోజులు నివురుగప్పిన నిప్పులా ఉంది. అయితే ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా తమ అనుచరులతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఎమ్మెల్యే జైపాల్​ అనుచరులు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పార్టీ కార్యక్రమాలు చేపట్టినప్పుడు తమ అనుచరగణానికే సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్సీ కసిరెడ్డి అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ విధంగా ఇద్దరి నాయకుల అనుచరులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇదే విధంగా వికారాబాద్ జిల్లాలోని తాండూర్​ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలేట్​ రోహిత్​ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్​ రెడ్డి మధ్య పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల ప్రారంభంలో వీరిద్దరి మధ్య వివాదం అధిష్టానం వద్దకు చేరడంతో అంతర్గత వార్​ నడుస్తోంది.

అనుచరుల సంఖ్యను పెంచుకునేలా..

నియోజకవర్గంలో తమదైన ముద్ర వేసుకోవాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తాపత్రయ పడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి నిరాశే మిగిలింది. జైపాల్​ యాదవ్​కు అధిష్టానం అవకాశం కల్పించింది. దీంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికీ నియోజకవర్గంలో తమ అనుచరులను పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కడ్తాల్​​ ఎంపీపీ, వైస్​ ఎంపీపీలను కసిరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్​ఎస్​లోకి చేర్చుకున్నారు. అదేవిధంగా ఆమన​గల్ ఎంపీపీ, ఎమ్మెల్సీకి అనుకూలంగా వ్యవహరించడంతో వర్గవిబేధాలు బహిర్గతమయ్యాయి.

ఎవరికి వారే..

రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలోని టీఆర్​ఎస్ శ్రేణులు ఎవరికి వారుగానే వ్యవహరిస్తున్నారు. ఎవరి వెంట వచ్చిన కార్యకర్తలు వారి వైపే ఉండడంతో పార్టీలో కలిసి పనిచేసేందుకు ససేమిరా అంటున్నారు. జిల్లాలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇలాకాలో చాప కింద నీరులా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు జిల్లా పరిషత్ చైర్మన్​ తీగల అనితా రెడ్డి మహేశ్వరంలో పాగా వేసేందుకు అంతర్గత ప్రయాత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిషన్​ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో తిరుగుతూ హల్​చల్ చేస్తున్నారు. కిషన్​ రెడ్డిని పైకి వ్యతిరేకించకపోయినప్పటికి కంచర్ల, క్యామ మల్లేష్​లు తమ అనుచరులతో చిన్న చిన్న అల్లర్లను సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్​కి, సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్​ రెడ్డికి.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు, మాజీ ఎమ్మెల్యే కే.ఎస్​ రత్నంలకు.. వికారాబాద్​ ఎమ్మెల్యే ఆనంద్​కు విద్యార్థి ఉద్యమ నాయకుడు నందుకు.. కొడంగల్​లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్​ రెడ్డికి, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిలకు.. మహేశ్వరంలో ఎమ్మెల్యే మహేశ్ రెడ్డికి, డీసీసీబీ చైర్మన్​ మనోహర్ రెడ్డిలకు.. తాండూర్ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డికి.. జడ్పీ చైర్మన్​ సునితా రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్​ రెడ్డిలకు మధ్య వార్​ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed