జాబ్ మార్కెట్‌పై స్పష్టత సెప్టెంబర్‌లోనే…

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు స్తబ్దుగా ఉండటంతో ఆగష్టులో పట్టణ నిరుద్యోగ రేటు 9.83 శాతం, గ్రామీణ నిరుద్యోగం 7.65 శాతానికి పెరిగాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) నెలవారీ నిరుద్యోగ గణాంకాల ప్రకారం జులైలో 7.43 శాతంతో పోలిస్తే మొత్తం నిరుద్యోగ రేటు 8.35 శాతానికి పెరిగింది.

ఇక, జులైలో పట్టణ నిరుద్యోగం 9.15 శాతం, గ్రామీణ నిరుద్యోగం 6.66 శాతంగా నమోదయ్యాయి. మొత్తం నిరుద్యోగ రేటు కరోనాకు ముందు మార్చిలో 8.75 శాతంతో పోలిస్తే ఆగష్టులో కొంచెం తక్కువగానే నమోదైంది. అలాగే, మార్చిలో పట్టణ నిరుద్యోగం 9.41 శాతం నమోదవగా, గ్రామీణ నిరుద్యోగం 8.44 శాతంగా నమోదయ్యాయి.

అయితే, ప్రస్తుత ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలతో పోల్చినపుడు ఆగష్టులో నిరుద్యోగ రేటు చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఆగష్టులో నిరుద్యోగం పెరగడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కఠినమైన సుధీర్ఘ లాక్‌డౌన్ తర్వాత అనేక రంగాల్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించిన సమయంలో ఇది పెరగడం ఆశ్చర్యంగా ఉందని వారంటున్నారు.

‘జాబ్ మార్కెట్లో నిరుత్సాహం కనిపిస్తోంది. దీని ఫలితంగా రికవరీ నెమ్మదిగా ఉంటుంది. సెప్టెంబర్ నాటికి జాబ్ మార్కెట్ రికవరీ గురించి స్పష్టత ఉంటుందని భావిస్తున్నట్టు’ సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ వ్యాస్ తెలిపారు.

Advertisement