రాష్ట్రపతి ముందుకు రాజస్తాన్ పంచాయితీ

by Shamantha N |
రాష్ట్రపతి ముందుకు రాజస్తాన్ పంచాయితీ
X

జైపూర్: రాజస్తాన్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సీఎం అశోక్ గెహ్లాట్ మాత్రం అలుపెరుగని విక్రమార్కుడిలా అసెంబ్లీ నిర్వహణకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా, రాజస్తాన్ గవర్నర్ క్యాబినెట్ అభ్యర్థన మేరకు అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం లేదని, ఇందులో జోక్యం చేసుకోవాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మెమోరాండం పంపారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై ప్రధానికి ఫోన్‌లో వివరించారు. ప్రధానితో ఫోన్‌లో మాట్లాడారని ప్రకటించిన గంటల వ్యవధిలోనే గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా అసెంబ్లీ సమావేశానికి సమ్మతి తెలుపుతూ కండీషన్లు ముందుంచారు. రెండో సారి సీఎం గెహ్లాట్ పంపిన ప్రతిపాదననూ వెనక్కి పంపారు. ఫ్లోర్ టెస్టుకైతే 21 రోజలు ముందస్తు నోటీసు అవసరం లేదని, కరోనా కారణంగా అసెంబ్లీకి హాజరవ్వడానికి కనీసం మూడు వారాల గడువైనా ఇస్తున్నారా? అని ప్రశ్నిస్తూ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్టు నిర్వహిస్తే భౌతిక దూరం సహా ఇతర జాగ్రత్తలకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని అడిగారు. కాగా, దీనిపై వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ గవర్నర్ రాసిన ఆరు పేజీల లవ్ లెటర్ అందిందని సీఎం గెహ్లాట్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు నుంచి స్పీకర్ సీపీ జోషీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

నంబర్ల గలాటా..!

102 మంది ఎమ్మెల్యేల మద్దతున్నదని, ఫ్లోర్ టెస్టు నిర్వహిస్తే మరో ఆరునెలల వరకు నిశ్చింతగా ఉండొచ్చన్న అభిప్రాయాన్ని సీఎం అశోక్ గెహ్లాట్ కలిగి ఉన్నట్టు తెలుస్తుండగా, సచిన్ పైలట్ వర్గం, బీఎస్పీ ఆయన ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయి. సీఎం క్యాంప్‌లోని 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలతో తమ వెంటే ఉంటారని, వారిని స్వేచ్ఛగా వదిలితే తమ దగ్గరకు వస్తారని పైలట్ శిబిరం ఎమ్మెల్యే హేమారాం చౌదరి వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు సీఎం గెహ్లాట్‌కు వ్యతిరేకంగా ఓటువేయాలని మాయావతి పార్టీ విప్ జారీ చేసింది. ఈ విప్ ఉల్లంఘిస్తే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని హెచ్చరించింది. దీంతో ఇరువర్గాలు నంబర్లను లెక్కించే పనిలో పడ్డాయి.

ప్రస్తుతం సచిన్ శిబరం 19 ఎమ్మెల్యేలు లేకుండా ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్పీకర్‌తో కలిపి కాంగ్రెస్ దగ్గర 88 ఎమ్మెల్యేలున్నారు. పది మంది స్వతంత్రులు, ఒక ఆర్‌ఎల్డీ ఎమ్మెల్యే, ఇద్దరు బీటీపీ చట్టసభ్యుల మద్దతు ఉన్నది. వీరే కాకుండా ఇద్దరు సీపీఎం ఎమ్మెల్యేలలో ఒకరు గెహ్లాట్‌కు మద్దతునివ్వనున్నట్టు తెలిపారు. వీరితో గెహ్లాట్‌కు 102 మంది ఎమ్మెల్యేల మద్దతున్నట్టు తెలుస్తున్నది. కానీ, సచిన్ పైలట్ శిబిరం కామెంట్లతోపాటు బీఎస్పీ విప్‌లు గెహ్లాట్ ప్రభుత్వానికి ముప్పును కలుగజేసేలా ఉండగా, బీజేపీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? అని ఎదురుచూస్తున్నట్టు ఉండటంతో గెహ్లాట్ సర్కారు నిప్పుల మీద నడకనే సాగిస్తున్నదని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement

Next Story