యాసంగిలో ఏ పంటలు వేద్దాం?

by Anukaran |
యాసంగిలో ఏ పంటలు వేద్దాం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న యాసంగి సీజన్‌లో నిర్ణీత పంటల సాగు విధానం ఎలా ఉండాలి, ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలను వేయాలి, ఏ పంటలు వేయకూడదు, ఏ పంట వేస్తే ఎంత లాభం? నష్టం వచ్చే పంటలేంటి.. తదితర అనేక అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం తర్వాత ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. వానాకాలం సాగు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నియంత్రిత సాగు విధానానికి రైతులు సంపూర్ణ మద్దతు తెలిపినందున రానున్న యాసంగిలో ఇదే విధానాన్ని ఏ తీరులో అమలుచేయాలనేదానిపై ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు, నిపుణులతో సీఎం చర్చించనున్నారు. వ్యవసాయం, పౌరసరఫరాల శాఖల మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొనే ఈ సమావేశంలో యాసంగిలో ఏ పంట వేయాలి? ఏ పంట వేయొద్దు? ఏ పంట వేస్తే లాభం? ఏ పంట వేస్తే నష్టం? తదితర అనేక అంశాలపై సమీక్ష జరగనుంది.

“కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్నది. దీనివల్ల దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం పడుతుంది. అందువల్ల రాష్ట్రంలో మక్కల సాగుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శనివారం నాడు సమావేశంలో ఈ విషయంపై విస్త్రతంగా చర్చిద్దాం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కరోనా ముప్పు ఇంకా తొలగనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా సీఎం ఈ సమావేశంలో సమీక్షిస్తారు.

కరోనా పరిస్థితుల్లో ఈ ఏడాది యాసంగి పంటలను గ్రామాల్లోనే ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి సేకరించామని, కరోనా ముప్పు ఇంకా తొలగనందున వానాకాలం పంటలను కూడా అదే తరహాలో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి సేకరించాలని సీఎం అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఆరు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని పౌర సరఫరాల శాఖకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పంటలను కొనుగోలుచేసిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలోనే రైతులకు డబ్బులు చెల్లించాలని, ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లనూ ముందుగానే చేసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రగతి భవన్‌లో జరిగే సమీక్షా సమావేశంలో ఈ అంశాలను నొక్కిచెప్పి, పకడ్బందీ ఏర్పాట్లు చేసే దిశగా తగిన దిశానిర్దేశం చేయనున్నారు. మొక్కజొన్న రైతులకు నష్టం రాకుండా, అన్యాయం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed