హామీలు తప్పా నిధులివ్వలే..!

by  |
హామీలు తప్పా నిధులివ్వలే..!
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా విషయమై కేంద్రం నుంచి హామీలే తప్ప ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని, అయినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కార్పొరేటు ఆస్పత్రులు లక్షలాది రూపాయలు దౌర్జన్యంగా వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే డబ్బులు దండుకోవడానికి ఇదే సమయమా అని మండిపడ్డారు. అవసరమైతే ఐఏఎస్ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీలో బుధవారం స్వల్పకాలిక చర్చ సందర్భంగా వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చిన అనంతరం సభ్యులు పలు విషయాలపై చర్చకు దిగారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైపోయిందన్న వ్యాఖ్యలు అర్థరహితమని, జాతీయ స్థాయి గణాంకాలతో పోలిస్తే సంతృప్తికరమైన స్థాయిలో ఉన్నామన్నారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడంపై చర్చిస్తాం..

కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు చెందిన సభ్యుల సూచన మేరకు రానున్న బడ్జెట్‌లో ప్రజారోగ్య రంగానికి నిధులను పెంచుతామని హామీ ఇచ్చారు. కరోనా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నిధులను కేటాయించి పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడంపై సూచనలు వచ్చాయని, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా కోసం కేంద్రం ప్రత్యేకంగా రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని, జాతీయ ఆరోగ్య మిషన్ కింద అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే మనకూ రూ.265 కోట్ల మేర ఇచ్చారని, అదనంగా రూ.90 కోట్లను ఇచ్చినా, మళ్లీ ఇవ్వబోయే నిధుల్లో కోత పెడుతుందని తెలిపారు. కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వమే నిలదొక్కుకున్నదని, వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని, ఇంకో వెయ్యి కోట్లు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.

ఎవ్వరినీ సంప్రదించం..

విపత్తుల సమయంలో ప్రభుత్వాలు సహజంగా అన్ని పార్టీలను సమావేశపర్చి నిర్ణయం తీసుకుంటాయని, అన్నివైపుల నుంచి అభిప్రాయాలను తీసుకుంటాయని, కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదని మజ్లిస్ నేత అక్బరుద్దీన్, కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సీఎం బదులిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాలతో మాట్లాడే ప్రసక్తే లేదన్నారు. ప్రతిపక్షాలకు అలాంటి బాధ్యత లేదని, వాటిని కలవడం కుదరదని తేల్చి చెప్పారు. అదే సమయంలో కార్పొరేటు ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులను టాస్క్ ఫోర్స్ విచారించి ప్రతీ వారం ఇచ్చే నివేదికను ప్రతిపక్ష పార్టీలకు అందజేస్తామని, వైద్యారోగ్య మంత్రి స్వయంగా వారిని పిలిచి సమీక్ష చేస్తారని అన్నారు.

ఇరవై సంవత్సరాలుగా తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, తుఫానులు, వరదలు లాంటివి చాలా చూశానని, అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలను నిర్వహిస్తుందని, కానీ తెలంగాణలో అది లేదన్నారు. ప్రభుత్వం తన బాధ్యత విస్మరించిందన్నారు. కరోనా ఇంకా ఖతం కాలేదని, 1.45 లక్షల మంది వైరస్‌కు గురయ్యారని, రాబోయే రోజుల్లో ప్రభుత్వం నిర్దిష్టమైన ప్లాన్ రూపొందించాలని సూచించారు. రెండో వేవ్ కోసం ప్రభుత్వం ఎలా సన్నద్ధమవుతుందో కూడా తెలియడం లేదని అక్బరుద్దీన్​ అన్నారు.

ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీ ఊహించాం..

కరోనా కష్టకాలాన్ని ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు దోపిడీ కోసం వాడుకుంటాయని తాను ముందుగానే గ్రహించానని, అందుకే టెస్టులకు, చికిత్సకు పర్మిషన్ ఇవ్వలేదని సీఎం వివరించారు. కేంద్ర ప్రభుత్వం కరోనా టెస్టులకు ప్రైవేటు ల్యాబ్‌లకు పర్మిషన్ ఇచ్చే విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదన్నారు. చివరకు హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో టెస్టులకు, చికిత్సకు అనుమతి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. వాటి దోపిడీ గురించి తాను అనుమానించినట్లుగానే జరిగిందని, కార్పొరేట్​ ఆస్పత్రులు మరీ దుర్మార్గంగా దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టాస్క్ ఫోర్స్ నివేదికలకు అనుగుణంగా స్థాయితో సంబంధం లేకుండా అలాంటి ఆస్పత్రులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

వివరాలు లేకుండా చర్చ ఎలా..?

కరోనాపై అసెంబ్లీలో చర్చ కోసం మంత్రి ఈటల రాజేందర్ అందించిన నోట్‌పై మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఫైర్ అయ్యారు. కరోనా వారియర్ల సేవలకు గుర్తింపు, విరాళాలు ఇచ్చినవారికి కృతజ్ఞతలుగానీ నోట్‌లో లేకపోవడం బాధాకరమన్నారు. దేశం కోసం జవాన్లు చేస్తున్న కృషిలాగనే కరోనా చికిత్స కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పేషెంట్లకు సేవ చేస్తున్నారని, కానీ వారి సేవలను ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. సీఎంఆర్ఎఫ్‌కు వచ్చిన నిధుల వివరాలు, ప్రజా జీవితాలపై కరోనా ప్రభావం, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై ఏ స్థాయిలో ఉందో కూడా నోట్‌లో లేదని దీంతో చర్చకు అర్థమేముంటుందని ప్రశ్నించారు.

ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు : మల్లు భట్టి

కరోనా కారణంగా లక్షలాది మంది ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వానికి ప్రజారోగ్య వ్యవస్థపై పట్టింపు లేదని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను అన్ని జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో స్వయంగా పరిస్థితుల్ని పరిశీలించానని, వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆరేళ్లయినా భర్తీ కాలేదన్నారు. వైద్యారోగ్య సిబ్బందికి కరోనా వస్తే కూడా తగిన సౌకర్యాలు లేవన్నారు. చాలా ఆసుపత్రుల్లో చికిత్సకు అవసరమైన ఉపకరణాలు కూడా లేవని, ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకమే లేదన్నారు. అప్పులు చేసుకుని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తూ ఆర్థికంగా చితికిపోతున్నారని అన్నారు. బీపీఎల్ కుటుంబాలకు ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు.

అక్బర్‌తో సీఎం వాగ్వాదం..

కరోనా నోట్‌లో ప్రభుత్వం అవసరమైన గణాంకాలను పెట్టలేదని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యకు ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. అన్నింటినీ పెడితే 200 పేజీలు దాటుతుందని, మహాభారతమంతా అందులో పెట్టలేమన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని విమర్శించడం వైద్యారోగ్య రంగ సిబ్బంది మనోస్థయిర్యాన్ని నీరుగార్చడమేనని, నిర్వహణ సరిగ్గా లేకపోతే ఇతర రాష్ట్రాల కంటే పాజిటివ్ కేసుల్లో, మృతుల సంఖ్యలో తెలంగాణ ఎందుకు మెరుగ్గా ఉంటుందని సీఎం ప్రశ్నించారు. కరోనా అంశాన్ని రాజకీయాలకు వాడుకోవడం తగదన్నారు. ప్రజలకు మరింత ధైర్యం కల్పించాల్సిన ప్రతిపక్షాలు బాధ్యతను విస్మరిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రజలు స్వీయ నియంత్రణ తీసుకోవాల్సిందేనని, తెలంగాణలో మాత్రమే కాకుండా దేశమంతా, ప్రపంచమంతా పరిస్థితి ఇలాగే ఉందన్నారు. కాగా, వాస్తవాలు మాట్లాడితే ప్రభుత్వాన్ని విమర్శించినట్లుగా సీఎం భావిస్తున్నారని, ప్రభుత్వం తన విధానాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సూచిస్తున్నామని అక్బర్​ పేర్కొన్నారు.


Next Story

Most Viewed