వేరే శాఖలకు VRO.. నచ్చకపోతే అంతే..!

by  |
వేరే శాఖలకు VRO.. నచ్చకపోతే అంతే..!
X

దిశ, న్యూ‌స్‌బ్యూరో: సీఎం కేసీఆర్ మరో సంచలనానికి తెరలేపారు. మూడున్నర దశాబ్డాల తర్వాత గ్రామస్థాయి పోస్టులే అవసరం లేదంటూ రద్దు చేశారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ రికార్డులను నిర్వహించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి (VRO) పోస్టులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర సర్కారు భూ పరిపాలన సమగ్రమైన, సక్రమ వ్యవస్థీకరణతో పాటుగా సమాచార సాంకేతికతను వినియోగించి భారీ ఎత్తున భూమి రికార్డులను ఆధునీకరించాలని ప్రతిపాదించింది. దాంతో వీఆర్వో పోస్టు పట్టులేనిదిగా మారింది. అందుకే వీఆర్వో పదవులను రద్దు చేయాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలో ఆ పదవి కలిగిన ప్రతి వ్యక్తి ఆ పదవి నుంచి విరమించుకోవాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల పదవుల రద్దు బిల్లు, 2020 స్పష్టం చేసింది.

వారి సేవలను ఏదైనా ప్రభుత్వ శాఖలోకి బదిలీ లేదా విలీనం చేస్తున్నట్లు బుధవారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎవరైనా తన సర్వీసును బదిలీ చేసేందుకు విముఖత చూపిస్తే నిబంధనల ప్రకారం పదవీ విరమణ పొందొచ్చు. లేదంటే రాజీనామా చేయొచ్చునని చట్టం స్పష్టం చేసింది. ఇక ఊర్లల్లో వీఆర్వో ఉండడు. ప్రతి వ్యక్తి నోట్లో నాలుకలా ఉండే వీఆర్వో పదం కనుమరుగు కానుంది. పటేల్- పట్వారీ పదాల మాదిరిగా ఇది చరిత్రగా మిగులుతుంది. దాదాపు 30 ఏండ్లకు పైగా గ్రామాల్లో మమేకమైన ఈ పోస్టుకు స్వస్తి పలికారు. ప్రతి భూ సమస్యకు మండల కేంద్రం వరకు వెళ్లాల్సిన పరిస్థితులు రానున్నాయి. ఎక్కడైనా కబ్జాలకు పాల్పడుతున్నారన్నా, ప్రమాదాలు వాటిల్లినా..ఇంకేదైనా ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినా తహసీల్దార్‌కే మొర పెట్టుకోవాల్సి వస్తుంది.

ఇతర శాఖల్లో వారి సేవలు..

ఈ చట్టం నిబంధనలను అమలు పరచుటలో ఏదైనా చిక్కులు ఏర్పడితే, తాను అవసరమని, ఉపయుక్తమని భావించునట్లుగా ఉత్తర్వులు జారీ చేయొచ్చు. బిల్లులో వీఆర్వోలుగా పని చేస్తోన్న ప్రతి వ్యక్తి సేవలను పరిపాలన అవసరాన్ని బట్టి ఏదైనా ప్రభుత్వ శాఖలో తత్సమానమైన శ్రేణిలోకి బదిలీ చేయనున్నారు. వీలినం చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉన్నది. ఇతర శాఖలో వినియోగించనున్నందున ఈ ప్రతిపాదన ద్వారా ఎలాంటి ఆర్ధిక పరమైన ప్రభావం ఉండని సీఎం పేర్కొన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 5,485 మంది వీఆర్వోలు ఇతర శాఖలకు బదిలీ కానున్నారు.

అయితే, ముందుగానే ఆయా సంఘాలు వారి సర్వీసులకు భంగం కలగకుండా చూడాలని చెప్పారు. ఈ క్రమంలో సంఘాలు ప్రతిఘటించకుండానే ఇతర శాఖల్లోకి సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేస్తున్న నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో వీరి పని ఏం లేదని చట్టంలోనే ప్రకటించడం విశేషం. కేవలం రికార్డుల రాతకే వీఆర్వోలు ఉన్నట్లుగా సర్కారు చిత్రీకరించింది. ఇప్పటి దాకా రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకం అమలు, రైతు బీమా వంటి పథకాల్లో కీలక భూమిక పోషించిన ఉద్యోగుల అవసరం లేదని రద్దు బిల్లును సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.


Next Story

Most Viewed