తెలంగాణ బిల్లుపై ప్రణబ్ సంతకం చేశారు

దిశ, వెబ్‌డెస్క్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ మరణం దేశానికి తీరని లోటని, వ్యక్తిగతంగా, తెలంగాణ ప్రజల తరపున నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలంగాణ అంశంతో ప్రణబ్ ముఖర్జీకి ఎంతో అనుబంధం ఉందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం వేసిన కమిటీకి ప్రణబ్ నాయకత్వం వహించారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై సంతకం చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందని ప్రణబ్ భావించేవారని, తాను కలిసిన ప్రతీసారి ఎన్నోవిలువైన సూచనలు చేసేవారని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఒక నాయకుడు ఉద్యమాన్ని ప్రారంభించి విజయ తీరాలకు చేర్చే అవకాశం అరుదుగా లభిస్తుందని, ఆ ఘనత తనకు దక్కిందని ప్రణబ్ ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ద కొయలేషన్ ఇయర్స్ పుస్తకంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రణబ్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో యాదాద్రి ఆలయ పనులను పరిశీలించి అభినందించారు.

Advertisement