ఈ నెల 27న రాష్ట్ర అవతరణ వేడుకలపై సీఎం సమావేశం

by Shyam |
ఈ నెల 27న రాష్ట్ర అవతరణ వేడుకలపై సీఎం సమావేశం
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో పలు శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రతీ ఏటా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏదో ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టడం, కొన్ని హామీలను ఇవ్వడం ఆనవాయితీ. అయితే గతేడాది లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ఈ వేడుకలు సాదాసీదాగానే జరిగాయి. ఈసారి కరోనా లాక్‌డౌన్ ఆంక్షలు ఉన్నందున ఎక్కువమంది గుమికూడడంపై నిషేధం ఉండడం, సామాజిక దూరాన్ని పాటించాల్సి రావడం తదితరాల నేపథ్యంలో నిరాడంబరంగానే జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.

లాక్‌డౌన్ ఆంక్షలపై సమీక్ష

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రస్తుతం అమలుచేస్తున్న ఆంక్షలు, తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ కొనసాగుతున్న తీరు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సగం షాపులు ఒక రోజు, సగం షాపులు మరుసటి రోజు తెరుస్తూ ఉన్నందున మరి కొంత కాలం ఇదే విధానాన్ని కొనసాగించాలా లేక మార్పులు చేయాల్సిన అవసరం ఉందా, ఎలాంటి మార్పులు చేయవచ్చు అనే అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 31వ తేదీ నాటికి నాల్గవ విడత లాక్‌డౌన్ ముగుస్తున్నందున ఆ తర్వాత కేంద్రం నుంచి వెలువడే మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అంశాలపైనా చర్చ జరగనున్నట్లు సమాచారం.

ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి, రోహిణి కార్తె ప్రవేశించిన నేపథ్యంలో వర్షాకాలం సాగుపై చర్చించనున్నారు. గ్రామాల్లో ఎరువులు, విత్తనాల లభ్యతపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటారు.

Advertisement

Next Story