- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ లో మే 7 వరకు లాక్‌డౌన్..
– ఆంక్షలు యథాతథం
– ఇంటి అద్దెల వసూళ్ళు మూడు నెలలు వాయిదా
– ఫుడ్ డెలివరీలు బంద్…..
కేంద్ర ప్రభుత్వం మే నెల 3 వరకు లాక్‌డౌన్ ప్రకటించినా తెలంగాణలో మాత్రం 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చినా.. తెలంగాణలో మాత్రం ఎలాంటి సడలింపులు ఉండవు. ఇప్పుడున్న ఆంక్షలే యధాతథంగా కొనసాగనున్నాయి. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీలు, విమాన సర్వీసులు, ప్రజా రవాణా మే 7 వరకు పూర్తిగా బంద్ కానున్నాయి. కిరాయి ఇండ్ళలో ఉండేవారు మూడు నెలల వరకు అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేకుండా వాయిదాల పద్ధతిలో ఆ తర్వాతి నెలల్లో చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు 50% కోత విధించినట్లుగానే వచ్చే నెలలో అందుకునే వేతనంలోనూ కోత ఉండనుంది. అయితే మెడికల్, పారిశుధ్య సిబ్బందికి పది శాతం ప్రోత్సాహకం వచ్చే నెలలోనూ కొనసాగనుంది. కాగా, విద్యుత్ ఉద్యోగులకు మాత్రం సర్కారు పూర్తి వేతనం చెల్లించనుంది. మే నెల 1వ తేదీ వరకు వైరస్ వ్యాప్తి తగ్గేలా లేనందున కంటైన్‌మెంట్ జోన్లలో ఆంక్షలు మరింత కఠినంగా ఉండనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది.
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రకటిస్తూ.. 1897 ఎపిడమిక్ చట్టం ప్రకారం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నందున, కేంద్రం లాక్‌డౌన్‌ను మే నెల 3వ తేదీ వరకు విధించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం 7వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20వ తేదీ తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చిందని, కానీ తెలంగాణలో మాత్రం అలాంటి సడలింపులు ఉండవని, ఇప్పుడు అమలవుతున్నట్లుగానే ఆంక్షలు యధాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్ పరిస్థితిపై ప్రభుత్వం సర్వే చేసిన అనంతరం ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం మేరకు మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కొద్దిమంది మే నెల చివరి వరకూ కొనసాగించాలని అభిప్రాయపడ్డారని ఉదహరించారు. లాక్‌డౌన్ ఎత్తివేతపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మే నెల 5వ తేదీన మళ్ళీ మంత్రివర్గం సమావేశమై చర్చిస్తుందని తెలిపారు. మే 7 వరకు విమాన సర్వీసులు కూడా తెలంగాణలో ఉండనందున ప్రయాణీకులు తెలంగాణకు రావద్దని, ప్రమాదం కొనితెచ్చుకోవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. జీఎంఆర్ ఎయిర్‌పోర్టు నిర్వాహకులకు కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఏ మతానికి చెందినవైనా సామూహిక ప్రార్థనలు చేసుకోడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. రంజాన్ మాసమైనా ఆ మతం వారికీ ఇది వర్తిస్తుందన్నారు.
ప్రస్తుతం కిరాయి ఇండ్లలో ఉంటున్నవారు లాక్‌డౌన్ కారణంగా ఇండ్లకే పరిమితమైనందున వారు రానున్న మూడు నెలల వరకు అద్దె చెల్లింపులో యజమానులు ఒత్తిడి తేవద్దని, ఈ మూడు నెలల అద్దెను వాయిదాల పద్ధతిలో ఆ తర్వాత చెల్లిస్తారని, దీనికి వడ్డీ వేయరాదని, ఈ మేరకు విపత్తు నిర్వహణ చట్టంలో ఉన్న నిబంధన మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు.
పరిశ్రమలు కూడా ఫిక్స్‌డ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నామని, ఆ తర్వాత వెసులుబాటును బట్టి పెనాల్టీ లేకుండా చెల్లించుకోవచ్చన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు సైతం ఒక్క నెల ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి తప్ప ఇతర రూపాల్లో ఎలాంటి ఫీజును వసూలు చేయరాదని స్పష్టం చేశారు. ట్యూషన్ ఫీజును ఏడాది మొత్తానికి కలిపి ఒకేసారి వసూలు చేసినా అది ప్రభుత్వ నిర్ణయాన్ని ఉల్లంఘించడమే అవుతుందని, అవసరమైతే ఆ విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఢిల్లీలో ఒక ఫుడ్ డెలివరీ కారణంగా 69 మందికి కరోనా వచ్చిందని, దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణలో మే నెల 7వ తేదీ వరకు ఆ సేవలను నిలిపివేస్తున్నట్లు సీఎం తెలిపారు. వారి ద్వారా వైరస్ వ్యాప్తి కాకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. నిజానికి ఆ సేవల ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఆదాయం వస్తుందని, అయినా ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశమేనని వివరించారు. నిత్యావసర వస్తువులకు ఇప్పుడు ఉదయం వేళల్లో అనుమతి ఉన్నట్లుగానే ఇకపైన కూడా ఉంటుందని, అయితే సామాజిక దూరం విషయంలో మాత్రం పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తారని, రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. అవసరం లేకున్నా రోడ్లమీదకు వచ్చేవారిపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారని, ఇప్పటికే సుమారు 58 వేల వాహనాలను సీజ్ చేశారని, ఇకపైన కూడా ఇదే తీరులో పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తారని, ప్రజలు ఇండ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.
కంటైన్‌మెంట్ జోన్లలో ఆంక్షలు పకడ్బందీగా అమలవుతున్నాయని, ఇకపైన కూడా ఇదే తీరులో ఉంటాయన్నారు.
కరోనా కట్టడిలో వైద్యులు, మెడికల్ సిబ్బంది సేవలు అపారమైనవని, అందువల్ల ఈ నెల ఇచ్చినట్లుగానే ప్రోత్సాహక వేతనం వచ్చే నెల కూడా కొనసాగుతుందని, పారిశుధ్య సిబ్బందికి సైతం మొత్తం వేతనంలో 10% అదనంగా ఇస్తామన్నారు. ఈసారి పోలీసు శాఖ సిబ్బందికి కూడా పదిశాతం ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. విద్యుత్ ఉద్యోగుల కృషిని దృష్టిలో పెట్టుకుని వారికి కూడా పూర్తిస్థాయి వేతనం చెల్లిస్తామన్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు 50%, ప్రజా ప్రతినిధులకు 75% కోత వచ్చే నెలలోనూ తప్పదన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అందుకుంటున్న పింఛన్లలో ఫ్యామిలీ పింఛన్లను మాత్రం 75% మేర ఇస్తామని, వారి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆసరా పింఛన్లు యధావిధిగా సకాలంలోనే అందుతాయని, సుమారు 40 లక్షల మంది లబ్ధి పొందుతారని తెలిపారు. లాక్‌డౌన్ వచ్చే నెల 7 వరకు ఉంటున్నందున రాష్ట్రంలోని తెల్ల రేషను కార్డు ఉన్నవారికి తలా పన్నెండు కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1 500 చొప్పున వచ్చే నెల కూడా అందుతుందని తెలిపారు. వలస కార్మికులకు, రేషను కార్డు లేనివారికి మాత్రం తలా 12 కిలోల బియ్యం, రూ. 500 చొప్పున అందిస్తామని తెలిపారు.
కరోనా తీవ్రత దృష్ట్యా పెళ్ళిళ్ళు మరో నెల రోజుల పాటు ఇబ్బందులు తప్పవని, అందువల్ల ఫంక్షన్ హాళ్ళను తాత్కాలికంగా ఎరువులను నిల్వ చేసుకోడానికి గోదాములుగా వాడుకునేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ అవసరాల రీత్యా జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు ధాన్యం కొనుగోళ్ళలో రైతులకు సహకరించాలని కోరారు. రైతులకు బ్యాంకు ఖాతాల్లో పడుతున్న డబ్బు ఎక్కడికీ పోదని, వెంటనే డ్రా చేసుకోవాలనే తొందర వద్దని, అవసరమైనప్పుడు మాత్రమే బ్యాంకులకు వెళ్ళాలని సూచించారు. గందరగోళగానికి గురై ఏటీఎంలు, బ్యాంకుల దగ్గర గుమికూడవద్దని కోరారు.
రానున్న వ్యవసాయ అవసరాలకు సుమారు 21.5 లక్షల టన్నుల యూరియా, ఎరువులు అవసరం కాబట్టి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రతినిధులతో మాట్లాడి అప్పటికల్లా సమకూరే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వరి, మొక్కజొన్నలతో పాటు తెల్లజొన్నలు, పొద్దు తిరుగుడు పువ్వు, కందులు, శెనగలు తదితర పంటలకు కూడా గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.
గచ్చిబౌలి స్టేడియం సమీపంలోని స్పోర్ట్స్ టవర్‌ను ఇక ఎప్పటికీ వాడుకునేలా శాశ్వత ఆస్పత్రిగా తీర్చిదిద్దుతున్నామని, అన్ని హంగులూ సమకూర్చాల్సిందిగా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సీఎం వివరించారు. అవసరమైతే మరో పది ఎకరాల స్థలాన్ని కూడా కేటాయిస్తామని, పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ కళాశాలను నెలకొల్పి 750 పడకల సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలను కూడా సమకూరుస్తామని తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో ఇది టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి)గా రూపుదిద్దుకుంటుందన్నారు.
కేంద్రం సత్వర నిర్ణయాలు తీసుకోవాలి
లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రాలు పూర్తిగా ఆదాయాన్ని కోల్పోయాయని, కేంద్ర ప్రభుత్వమే విధాన నిర్ణయం తీసుకుని ఆదుకోవాలని మరోసారి నొక్కిచెప్పారు. ఈ విషయాన్ని ప్రధానికి లిఖితపూర్వకంగా తెలియజేయడంతో పాటు వీడియో కాన్ఫరెన్సు సందర్భంగానూ, ఫోన్‌లో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడూ వివరించానని గుర్తుచేశారు. కానీ ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని, సత్వర నిర్ణయం తీసుకోవాలి తప్ప తాత్సారం మంచిది కాదని అన్నారు. హెలికాప్టర్ మనీ గురించి ప్రస్తావించినా ఇప్పటికీ కేంద్రం దాని గురించి ఆలోచించలేదని, ఆ స్ఫూర్తితో కాకపోయినా ఏదో ఒక రకమైన ప్రత్యామ్నాయాన్ని రాష్ట్రాలకు సూచించి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, రిజర్వు బ్యాంకు లాంటి వ్యవస్థ ఉన్నదే అందుకోసమని అన్నారు. రాష్ట్రాలు ఇప్పటికే చేసిన అప్పులను, వాటిపైన చెల్లించే వడ్డీని ఆరు నెలల పాటు వాయిదా వేయాల్సిందిగా కోరానని, దానికి కూడా ప్రధాని నుంచి స్పందన రాలేదన్నారు. రాష్ట్రాలు కొత్తగా అప్పులు చేసుకోడానికి పరిమితిని పెంచడంతో పాటు ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని కూడా పెంచాల్సిందిగా ప్రధానిని కోరానని, ఇప్పటికీ నిర్ణయం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికపరంగా విధాన నిర్ణయాన్ని తీసుకునే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని, రాష్ట్రాలకు లేదని, అందువల్లనే ప్రధానిపై వత్తిడి తీసుకురావాల్సి వస్తోందన్నారు.
ఈ నెలాఖరు వరకూ కేసులు తగ్గేలా లేవు
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఎంత కృషి చేస్తున్నా తగ్గడంలేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితిపై లోతుగా సమీక్షించామని, మే నెల 1వ తేదీ వరకు తగ్గే సూచనలు లేవనేది స్పష్టమైందన్నారు. ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 858కి చేరుకున్నాయని, ఆదివారం ఒక్క రోజే 49 పెరిగాయని, ముగ్గురు చనిపోయారన్నారు. విదేశీ ప్రయాణం ద్వారా వచ్చిన వైరస్ కేసుల గొడవ లేదని, ఇప్పుడున్న వస్తున్నవన్నీ మర్కజ్ సంబంధమైనవేనని అన్నారు. కంటైన్‌మెంట్ జోన్ల ద్వారా మొత్తం వివరాలను సేకరిస్తున్నామని, ఈ నెల చివరికల్లా పూర్తిగా కొలిక్కి వస్తాయని, మే నెల నుంచి ఇక కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉండకపోవచ్చన్నారు. ప్రస్తుత తీవ్ర పరిస్థితుల్లో లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదన్నారు. చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నామని ఒక సందర్భంగా వ్యాఖ్యానించారు. అందుకే లాక్‌డౌన్ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. పండుగలు, ప్రార్థనలు అన్నీ ఇళ్ళల్లోనే చేసుకోవాలన్నారు.
Tags : Telangana, CM KCR, Media Conference, Cabinet Meeting, LockDown, May 7, No relaxations, Corona, Containment Zones