ఏడాది కిందే దళిత బంధు.. కరోనా వచ్చినందుకే లేటు: కేసీఆర్

by Anukaran |   ( Updated:2023-05-19 10:02:19.0  )
ఏడాది కిందే దళిత బంధు.. కరోనా వచ్చినందుకే లేటు: కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏడాది కిందే దళిత బంధుకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి బహిరంగ సభలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కరోనా నేపథ్యంలో దళిత బంధు ఆలస్యం అయిందని చెప్పారు. ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని.. అర్థం పర్థం లేని మాటలు మంచిది కాదన్నారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య భారతంలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా తెలంగాణలో దళిత బంధు తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్‌దే అన్నారు.

రాష్ట్రంలో కరీంనగర్​జిల్లా ప్రత్యేకతను చాటుకుంటుందని సీఎం కేసీఆర్ ​ఉద్ఘాటించారు. పేదలు, రైతులకు సంబంధించిన కీలకమైన పథకాలన్నీ కరీంనగర్ ​వేదికగా పురుడు పోసుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకునే రైతుబంధు కార్యక్రమాన్ని కరీంనగర్ ​నుంచి మొదలుపెట్టామన్నారు. ఇప్పుడు దళిత వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసే దళిత బంధు పథకాన్ని కూడా ఇక్కడే మొదలుపెట్టినట్లు వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో సకల జనుల సర్వే సందర్భంగా 25 వేల దళిత కుటుంబాల లెక్క తేలిందని సీఎం కేసీఆర్ వివరించారు.

దళిత బంధుతో అందరికీ డబ్బులు ఇవ్వడం లేదని, వారి ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం ఇస్తున్నామని, హుజురాబాద్​ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి వచ్చే నెల రోజుల్లో దళిత బంధు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రమంతా ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు. దళితులకు అండగా నిలువాలనేది తన లక్ష్యమని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. 25 ఏండ్ల కిందటే ఆలోచన చేశామన్నారు. అణిచివేతకు గురైన లక్షల మంది దళితుల కోసం పని చేస్తున్నామన్నారు. అంబేద్కర్ ​పోరాట ఫలితంగా కొంతమందికి అవకాశాలు వచ్చాయని, ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. కానీ, 95 శాతం మంది దళితులు ఇంకా అణిచివేతకు గురవుతున్నారని, గుండెల్లో బాధను అనుచుకుని జీవిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ పని ఏండ్ల కిందటే చేస్తే దళితులకు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.

Advertisement

Next Story