- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాలమూరు పచ్చబడాలంటే.. కాళేశ్వరంతో పోటీ పడాలే..!
దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరు జిల్లా పచ్చబడాలంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరుగులు పెట్టాలని, డిసెంబరు కల్లా పూర్తి చేసుకోవాలని, కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో అధికారులు వేగంగా పనులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం వద్ద పంపులను జూన్ చివరికల్లా బిగించాలని, టన్నెల్ పనులు కూడా అప్పటికల్లా పూర్తికావాలని స్పష్టం చేశారు. కాల్వ లైనింగ్ పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావాల్సిందేనని, కృష్టా బేసిన్‌లోని పెండింగ్ ప్రాజెక్టుల పనులను పూర్తిచేయాలన్నారు.
‘ఇరిగేషన్ శాఖ తెలంగాణకు లైఫ్ లైన్’ వంటిదని సీఎం కితాబిచ్చారు. పాలమూరు ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై ప్రగతి భవన్‌లో ఆదివారం సుదీర్ఘంగా చర్చించి.. దిశానిర్దేశం చేశారు. సాగునీటి పారుదల శాఖ అధికారులు పూర్తిస్థాయి నిబద్ధతతో పనిచేయాలని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులందరూ హాజరైన ఈ సమావేశంలో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, పునరావాసం, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, కాల్వల తవ్వకం, పంపుల బిగింపు, నీటిసరఫరా తదితర పలు అంశాలపై సీఎం చర్చించారు.
కాళేశ్వరంతో పోటీ పడాలి
పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు కాళేశ్వరంతో పోటీపడాలని, ఆ స్ఫూర్తిని పొందాలని, డిసెంబర్ డెడ్‌లైన్‌గా పూర్తి చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో మహబూబ్‌నగర్ నీటి గోసను, నల్లగొండ ఫ్లోరైడ్ కష్టాలను ప్రస్తావించకుండా నా ప్రసంగం సాగలేదు. నాటి పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగా పెండింగులో పెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆన్ గోయింగ్ పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కటొక్కటిగా పూర్తి చేసుకుంటున్నం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయాలని ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు కొందరు దుర్మార్గంగా కోర్టుల్లో కేసులు వేసి ‘స్టే’ల ద్వారా అడ్డుపడుతున్నరు. అయినా మనం పట్టుదలతో పనులు చేసుకుంటున్నం. జూరాలతో సహా ఇప్పటికే మనం కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా లాంటి ఆన్-గోయింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసుకుని దక్షిణ పాలమూరుకు చెందిన 11 లక్షల ఎకరాలను పచ్చగా చేసుకున్నం. ఇంకా వాటిల్లో కొసరు పనులు మిగిలాయి. వాటిని తొందరగా ఎట్లా పూర్తి చేసుకోవాలో ఆలోచన చేయాలె. కాళేశ్వరం స్పూర్తితో పనులు సాగాలె’ అని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నీటివాటాను ఒడిసిపట్టుకోవాల్సిందే..
సముద్రంవైపు ప్రవహించే కొద్దీ గోదావరి ప్రవాహం పెరుగుతూ ఉంటుందని, కానీ కృష్టానదికి మాత్రం ఆ వడి తగ్గుతూ ఉంటుందని సీఎం కేసీఆర్ వివరించారు. వర్షాలు తగ్గిపోవడంతో పాటు కృష్టా నదిపైన ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు, దిగువ రాష్ట్రం అక్రమంగా ఏర్పాటుచేసిన తూముల కారణంగా కృష్ణానదిలో నీటి లభ్యత ప్రమాదంలో పడిపోయిందని ఉదాహరించారు. అందువల్ల తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటివాటాను చుక్కనీరు పోకుండా వడిసిపట్టుకోవాల్సిందేనని, అందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సహా కృష్టానదిమీది అన్ని పెండింగ్ ప్రాజెక్టులనూ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసుకోవాల్సిందేనని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
పనుల పురోగతిని సమీక్షించాలి
ప్రస్తుతం పాలమూరు ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగుతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ‘కావాల్సినన్ని నిధులను ప్రభుత్వం అందిస్తున్నా పనులు ఎందుకు నిదానంగా జరుగుతున్నాయి?’ అని ప్రశ్నించిన సీఎం ఇకనుంచి పనులు వేగం కావాలని, ఇరిగేషన్ అధికారులు ఆ దిశగా సిద్ధం కావాలని స్పష్టంచేశారు. ప్రతివారం సమీక్షలు జరపాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించాలని ఉన్నతాధికారులు సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, సాగునీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావును సీఎం ఆదేశించారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇరిగేషన్ శాఖలో వివిధ స్థాయి అధికారుల దగ్గర తగినంత డబ్బును అందుబాటులో ఉంచిందని గుర్తుచేశారు.
డబ్బుల కోసం హైదరాబాద్ దాకా రానవసరం లేదని, ఎక్కడి అధికారి అక్కడే ఖర్చుచేస్తూ పనులను చేపట్టే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని గుర్తుచేశారు. ఇంజనీర్లు మనసుపెట్టి పనిచేయాలన్నారు. సమావేశంలో పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు ఎస్.నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, వీఎం అబ్రహం, టి.అంజయ్య యాదవ్, బి.కృష్ణమోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, సి.రామ్మోహన్ రెడ్డి, బి.హర్షవర్దన్‌రెడ్డి, సాగునీటిపారుదల సలహాదారు పెంటారెడ్డి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎస్ఈలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.