- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతులు కన్నీరు పెడుతుంటే సీఎం ఢిల్లీ యాత్రలా..?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, కల్లాల్లో కన్నీరు పెడుతుంటే ఢిల్లీలో కేసీఆర్ సేద తీరుతున్నాడని టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన టీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని, ఆ రెండు పార్టీల రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడని ఆరోపించారు. కల్లాల్లోని ధాన్యం కొనకుండా ఢిల్లీలో యాసంగి పంటపై డ్రామాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తడిచిన ధాన్యం కొనే అంశంపై కేసీఆర్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని, కొనుగోలులో జరుగుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం వల్లే వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని ఆరోపించారు.
యాసంగి ధాన్యం కొనే అంశంలో ఒత్తిడి చేయబోమంటూ కేంద్రానికి కేసీఆర్ ఇచ్చిన లేఖే నేడు వరి రైతుల పాలిట ఉరితాడు అయిందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన కల్లాల్లోకి కాంగ్రెస్’ పర్యటనలో రైతులు తెలిపిన ఆవేదనపైనే మాట్లాడుతున్నానన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ రైతాంగ విశ్వాసాన్ని కోల్పోయాయని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాల పరిహారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని, రైతులకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. నేడు మండల, జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ధర్నాలు.. నిరసన ప్రదర్శలు జరుగుతాయన్నారు. భవిష్యత్తులోనూ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్ధృతంగా పోరాడుతుందని చెప్పారు.
ప్రస్తుతం వానాకాలం పంట కండ్ల ముందు తడిచిపోతుందని, మొలకలు వచ్చిందని, వీటిని కొనుగోలు చేయకుండా అన్నింటికీ ముడిపెట్టి రైతుల గొంతు కోస్తున్నాయని మండిపడ్డారు. కల్లాల్లో రైతుల కన్నీరు తుడువాల్సిన సీఎం ఇందిరాపార్కు దగ్గర ఏసీ టెంట్కింద రెండు గంటలు సేదతీరి, మళ్లీ ఢిల్లీకి యాత్రకు వెళ్లాడని ఆరోపించారు. తుపాకీ రాముడు ప్రగల్భాలు పలుకుతున్నాడని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలోనే ఢిల్లీ వెళ్లొచ్చిన కేసీఆర్, మోడీతో చీకటి ఒప్పందం చేసుకున్నాడని, నల్ల వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా తన పార్టీ విధానాన్ని సవరించుకున్న విషయం మర్చిపోలేదన్నారు.
నల్ల చట్టాల రద్దు తమ నాయకుడు ఘనతే అని మంత్రులు కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రకటనలు చేస్తున్నారని, కేసీఆర్ ఏసీ టెంటులో రెండు గంటల ధర్నాతోనే మోడీ దిగొచ్చి నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని ప్రచారం చేసుకోవడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఇది నిజంగా ఉద్యమం చేసిన రైతులను అవమానించడమే అవుతుందని, నల్ల చట్టాలను రద్దు చేయించే శక్తే కేసీఆర్‌కు ఉంటే అదే శక్తిని ఉపయోగించి ధాన్యం కొనేలా మోడీని ఒప్పించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ బృందం తాజా ఢిల్లీ పర్యటన ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందంలో భాగమేనని, ఇద్దరు కలిసి రైతుల జీవితాలపై వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఈ తీర్థయాత్రల పర్యటనలతో ప్రయోజనం లేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందుకే ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని, మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని రేవంత్‌రెడ్డి లేఖలో తెలిపారు.