రండి మాట్లాడుకుందాం.. దళిత ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఆహ్వానం

by  |
రండి మాట్లాడుకుందాం.. దళిత ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌కు ఉద్వాసన పలికిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహం రోజుకో మలుపు తిరుగుతున్నది. ప్రగతి భవన్‌ను దాటి ప్రజల్లోకి వెళ్తున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఎన్నడూ విపక్ష నాయకులను ప్రగతి భవన్‌లోకే రానివ్వని కేసీఆర్ ఊహకు అందని విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురిని శుక్రవారం ఆహ్వానించి చర్చలు జరిపారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ‘దళిత ఎంపవర్‌మెంట్‘ పథకం విధివిధానాల రూపకల్పన కోసం చర్చించడానికి ఆయా పార్టీలకు చెందిన దళిత ఎమ్మెల్యేలతో పాటు వివిధ పార్టీల్లోని దళిత నేతలను ఆదివారం సమావేశమయ్యేందుకు ‘అఖిలపక్ష సమావేశం‘ పేరుతో ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. కలిసి కూర్చుని భోజనం చేద్దామని, ఆ తర్వాత వివరంగా చర్చించుకుందామంటూ ఉదయం 11.30 గంటలకు ముహూర్తాన్ని ఖరారు చేశారు.

సుదీర్ఘకాలం తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తుండడం విశేషం. మధ్యాహ్న భోజనం తర్వాత మొదలయ్యే ఈ సమావేశం రాత్రి వరకు సుదీర్ఘంగా కొనసాగుతుందని సీఎంవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అఖిలపక్ష సమావేశానికి, రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీలైన మజ్లిస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఉభయ వామపక్షాలకు చెందిన శాసనసభ్యులు ఎవరూ లేనందున వాటి తరఫున దళిత నాయకులను సమావేశానికి పంపాల్సిందిగా ఇరు పార్టీల రాష్ట్ర కార్యదర్శులకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి తెలిపారు.

దళిత సమస్యల పట్ల అవగాహన వుండి, ఆ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని పలువురు సీనియర్ దళిత నాయకులను కూడా ఆహ్వనించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడి స్వయం పాలన ప్రారంభమైన తక్కువ కాలంలోనే దార్శనికతతో అన్ని రంగాల్లో దళితుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదని సీఎం ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లోని దళితుల జీవితాల్లో గుణాత్మక అభివృద్ధిని సాకారం కావాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయమై కూడా ఈ సమావేశం చర్చించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీలకతీతంగా దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం లోతుగా, క్షుణ్ణంగా చర్చించి విధివిధానాలను ఖరారు చేయడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ఆ ప్రకటనలో నొక్కిచెప్పారు.

Advertisement

Next Story

Most Viewed