నిరుద్యోగ నేతలకు సీఎం గుడ్ న్యూస్

by Shyam |
నిరుద్యోగ నేతలకు సీఎం గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం 64 కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉండగా.. వీటిలో ముందుగా 40 నామినేటెడ్ పదవుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నట్లు గులాబీ పార్టీలో చర్చ సాగుతోంది. దీనికి ఆదివారం తెలంగాణ భవన్​ మీటింగ్లో కొంత క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నామినేటెడ్​ పదవులపై సీనియర్ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. మంత్రి కేటీఆర్‌ సీఎం ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్‌.. నామినేటెడ్​ పోస్టులపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిలో మంత్రి కేటీఆర్ నివేదికలను ప్రధానంగా తీసుకోనున్నట్లు కొంతమంది నేతలకు సైతం తేల్చి చెప్పారు.

కేడర్​కు ఇచ్చేద్దాం..

ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో కేసీఆర్​కు గుడి కట్టిన పార్టీ నేత.. గుడికి తాళం కూడా వేశారు. ఈ విషయం పార్టీ పెద్దలు సీఎంకు సూచించారు. ఇలాంటి విధేయులు పార్టీకి దూరమైతే ఇబ్బందులు ఎదురవుతాయని సున్నితంగా వివరించినట్లు సమాచారం. దీంతో పార్టీ మరిన్ని ఇబ్బందుల్లో పడకముందే అసంతృప్త నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెడతారనే ప్రచారం కూడా జోరందుకుంది. ప్రధానంగా కార్పొరేషన్ చైర్మన్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, డైరెక్టర్‌లతోపాటు ఇతర నియమిత పదవుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 64 కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు ఆశపడుతున్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలకు కూడా ఈ పదవుల్లో స్థానం కల్పించనున్నట్లు సమాచారం. మొత్తం 64 నామినేటెడ్ పదవుల్లో 40 వరకు పదవులను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.

సభ్యత్వ నమోదు తర్వాత మరికొన్ని..

ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గం సభ్యత్వ నమోదు ప్రక్రియను ముందేసుకుంది. దీంతో సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించే నేతలకు కొన్ని నామినేటెడ్​ పోస్టులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నిక, గ్రేటర్ వరంగల్, ఖమ్మం ఎన్నికల్లో పనితీరు కూడా ప్రామాణికంగా ఉంటుందనే సంకేతాలిచ్చారు. దీంతో ఈసారి నామినేటెడ్​ పోస్టు వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed