మండలానికో ఎమ్మెల్యే.. సాగర్‌పై పెద్ద సారు ఫోకస్

by Shyam |   ( Updated:2021-03-21 10:54:59.0  )
మండలానికో ఎమ్మెల్యే.. సాగర్‌పై పెద్ద సారు ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార టీఆర్ఎస్ పార్టీ నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపై ఫోకస్‌ పెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలకు మరింత పదునుపెడుతోంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం అక్కడి పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపింది. విజయం సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. తొలి అడుగుగా సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలకు ఒక్కో ఇన్ చార్జ్‌ని నియమించారు.

తిరుమలగిరి మండలానికి దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, అనుముల మండలానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దవూర మండలానికి చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్, గుర్రంపోడు మండలానికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నిడమనూరు మండలానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, త్రిపురారం మండలానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, హాలియా మున్సిపాలిటీకి సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సాగర్ మున్సిపాలిటీకి కరీంనగర్ మేయర్ సునీల్ రావు, ‘సుడా’ చైర్మన్ జేవీ రామకృష్ణ, మాడ్గులపల్లి మండలం పరిధిలోని 10 గ్రామాలకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. వారంతా స్థానిక పార్టీ కేడర్‌తో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు.

అభివృద్ధి పనులే ఎజెండా

నాగార్జునసాగర్, హాలియాల్లో మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం, రూ.వందల కోట్ల వ్యయంతో చేపట్టిన లిప్టులు, కెనాల్‌లకు శంకుస్థాపన, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణాలు, దవాఖానలకు నూతన భవనాలు, పలు అభివృద్ధి పనులు.. ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగాయని ప్రజలకు వివరిస్తున్నారు. సాగర్‌లోని ప్రభుత్వాసుపత్రిని వంద పడకలకు పెంచడం, హాలియాలో రాచకాల్వ నిర్మాణం, రూ.మూడుకోట్ల వ్యయంతో నిడమనూరులో చెరువు గండి పూడ్చివేత, రూ.65కోట్లతో 274 ఎకరాల్లో సాగర్‌లో బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణం, నెల్లికల్, కుంకుడుచెట్టు తండాలో రూ.72.50 కోట్లతో లిప్టులు, హాలియాలో డిగ్రీ కళాశాలకు అనుమతి ఇవ్వడంతో పాటు భవన నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేసిన విషయాన్ని వివరిస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతోనే పక్కా ప్రణాళికతో ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed