- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్..? ఆయనకే కేసీఆర్ ఛాన్స్?
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి అన్వేషణలో తీవ్ర తర్జనభర్జన పడుతున్న గులాబీ బాస్ కేసీఆర్ ఎట్టకేలకు గెల్లు శ్రీనివాస్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును దాదాపుగా ఖరారు చేశారని ప్రచారం. ఆయన అభ్యర్థిత్వాన్ని బుధవారం కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు దీనిపై ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే ముందుగా దళిత బంధు పథకం ప్రారంభించేందుకు ఈ నెల 16న హుజురాబాద్‌లో పర్యటించనున్న కేసీఆర్… అదే రోజు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఉపఎన్నిక అభ్యర్థిగా ప్రకటిస్తారనుకున్నారు. కానీ అంతకు ముందుగానే బుధవారం ప్రకటించనున్నట్లు తెలంగాణ భవన్లో టాక్.
హుజురాబాద్ టికెట్‌ను ముందుగా కౌశిక్ రెడ్డికే ఇవ్వాలనుకున్నప్పటికీ.. చాలామంది పేర్లను పరిశీలించారు. మొదట మాజీ ఎంపీ వినోద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి తనయుడు ముద్దసాని పురుషోత్తంరెడ్డి, ఆయన సతీమణి ముద్దసాని మాలతి, కొడుకు కశ్యప్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన స్వర్గం రవి, బీజేపీ నుంచి చేరిన పెద్దిరెడ్డి తదితరుల పేర్లు వినిపించాయి. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్వర్గం రవిల పేర్లు పరిశీలన జాబితాలో ముందుకు వచ్చాయి. అయితే ఫోన్ కాల్ లీక్ వ్యవహారంతో నిర్ణయం మార్చుకుని కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కట్టబెట్టి మరొకరికి అవకాశం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
గెల్లుకు కలిసొచ్చే అంశాలు
కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఖరారు కావడంతో.. ఇక్కడ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో జమ్మికుంటకు చెందిన పొనుగంటి మల్లయ్య, వకుళాభరణం కృష్ణమోహన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ల పేర్లను పరిశీలించిన కేసీఆర్… చివరకు గెల్లు వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. తొలి నుంచి పార్టీతో ఉన్న నేత, ఉద్యమకారుడు కావడంతో గెల్లు శ్రీనివాస్‌కే టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గానికే చెందిన నేత కావడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశం. గతంలో టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా పనిచేసిన బాల్క సుమన్‌కు కేసీఆర్ ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం ఇవ్వగా.. వరుసగా రెండుసార్లు ఆయన గెలిచారు.
మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. కీలక నేతలు, మంత్రులు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను ప్రకటించిన తర్వాత ఈ ప్రచారాన్ని మరింత స్పీడప్ చేయనున్నారు. కేసీఆర్ దళిత బంధు స్కీమ్ ప్రకటించిన నేపథ్యంలో ఆ సామాజికవర్గం ఓట్లన్నీ గంపగుత్తగా టీఆర్ఎస్‌కే పడతాయని, సెగ్మెంట్లో మెజారిటీ ఓట్లు దళితులవే కావడంతో ఆ సామాజికవర్గం తమ వెంట ఉంటే గెలుపు సునాయాసమే అని భావిస్తున్నారు. దీంతో బీసీ వర్గాల ఓట్లపై గురి పెట్టారు. దీనిలో భాగంగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టికెట్ ఇస్తారని భావిస్తున్నారు.
నేడే ప్రకటన
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి. హుజురాబాద్ సెగ్మెంట్లోని వీణవంక మండలం, హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ యాదవ కులానికి చెందిన నేత. ఎంఏ, ఎల్ఎల్బీ, రాజనీతిశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. శ్రీనివాస్‌పై 100కు పైగా కేసులు ఉండగా.. ఉద్యమ సమయంలో పలుమార్లు పోలీసులు అరెస్టు చేశారు. రెండు సార్లు జైలుకు వెళ్లి 36 రోజులు చర్లపల్లి, చంచల్ గూడలో జైలు జీవితం గడిపారు. 2017 నుండి టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.